న్యూఢిల్లీ: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో వీకెండ్ కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది.
వారానికి 5 రోజుల బ్యాంకింగ్ పనిదినాలు అమలు చేయాలని, ఉద్యోగులందరికీ ఒకేలా డీఏ లెక్కించాలని, ఎన్‌పీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఎంచుకునే అవకాశం కల్పించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
అత్యవసర పనులు ఉన్నవారు సమ్మెకు ముందే పూర్తి చేసుకోవాలని ఎస్ బీఐ ఖాతాదారులకు సూచించింది. సమ్మె రోజుల్లో ఏటీఎంలు, యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని కోరింది. సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు ప్రభుత్వ రంగ, గ్రామీణ బ్యాంకుల సీఈఓలతో కేంద్రం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
