హైదరాబాద్ సిటీకి ఎల్ నినో గండం.. మంచి నీటి కష్టాలు తప్పవు

హైదరాబాద్ సిటీకి ఎల్ నినో గండం.. మంచి నీటి కష్టాలు తప్పవు

హైదరాబాద్, వెలుగు: కోటి మందికి పైగా జనాభా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎కు ఎల్ నినో గండం పొంచి ఉంది. ఎల్ నినో ప్రభావంతో నగరవాసులకు మంచి నీటి కష్టాలు తప్పేలా లేవు. ముంచుకొస్తున్న ఎల్‌‌నినో పరిస్థితుల వల్ల రాజధాని హైదరాబాద్‌‌లో తాగునీటి సంక్షోభం తీవ్ర రూపం దాల్చబోతోందని ఉన్నతాధికారుల నివేదిక హెచ్చరించింది. 

ప్రస్తుతం నగర జలాశయాలకు అందుబాటులో ఉన్న నీటి నిల్వలు మరో 80 రోజులకు మాత్రమే సరిపోతాయని, రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవకపోతే నగరంలో మునుపెన్నడూ లేని నీటి కటకట తప్పదని అంచనా వేసింది. వర్షాభావం ఇలాగే కొనసాగితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శివారు మున్సిపాలిటీలతో పాటు దాదాపు 4 లక్షల నివాసాలకు పైప్‌‌లైన్ల ద్వారా నీటి సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని జలమండలి వర్గాలు లెక్కగట్టాయని తెలిపింది. 

నాగార్జునసాగర్, ఎల్లంపల్లిలో డెడ్ స్టోరేజీలను సైతం పూర్తిగా వాడేయాల్సిన విపత్కర పరిస్థితి ఏర్పడనుందని, అదే జరిగితే ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తుందని నివేదిక పేర్కొన్నది. అంచనాల ప్రకారం ఎగువ నుంచి జలాశయాలకు ఇన్-ఫ్లో రాకపోతే, డిసెంబర్ చివరి ​నాటికి నగరంలో రోజు విడిచి రోజు కూడా నీళ్లివ్వలేని దయనీయ పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. 

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సగటున 2 నుంచి 4 మీటర్ల మేర భూగర్భ జలమట్టాలు పడిపోగా.. రానున్న వేసవి ముగిసే నాటికి మరో 3 మీటర్ల లోతుకు పడిపోతాయని ఉన్నతాధికారులు అంచనా వేశారు. వర్షాలు సకాలంలో పడకపోతే రాష్ట్రంలోని దాదాపు 250కుపైగా మండలాలు పూర్తి డ్రై-జోన్‌‌లుగా మారే ముప్పు ఉందని పేర్కొన్నారు. 

మిషన్ భగీరథకు నీటిని సమకూర్చే నదులు, వాగుల్లో ప్రవాహం పూర్తిగా నిలిచిపోనుండటంతో గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థ దాదాపు కుదేలవుతుందని చెబుతున్నారు.  చెరువులు, కుంటలు ఎండిపోవడంతో రాబోయే రబీ సీజన్ ప్రారంభంలో కూడా సాగునీరు అందని దుస్థితి ఏర్పడనుందని అంచనా వేశారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు అట్టడుగుకు చేరుకోనుండటంతో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదని అధికారులు నివేదించారు.