హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉదయ్ కృష్ణా రెడ్డి రాసిన సూసైడ్ నోట్, కీలక ఆధారాలున్న ఐఫోన్ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. కాగా, తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణా రెడ్డిని పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్ గురించి నిందితుడిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రశ్నించారు.
అయితే, తాగిన మైకంలో సూసైడ్ నోట్ రాసినట్లు వెల్లడించిన ఉదయ్ కృష్ణా రెడ్డి.. ఆ లేఖ ఎక్కడుందో తెలియదని చెప్పినట్లు సమాచారం. అలాగే, తన ఐఫోన్ కూడా ఎక్కడుందో ఉదయ్ కృష్ణా రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఐఫోన్‌లో కీలక ఆధారాలు ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు.. సూసైడ్ నోట్, ఐఫోన్ మిస్సింగ్‌పై దర్యాప్తు చేపట్టారు.
అసలు కేసు ఏంటంటే..?
రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ)లో తోటీ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై ఉదయ్ కృష్ణారెడ్డిని లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బాధిత ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు మేరకు జూలై 18న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జులై 28న మిర్యాలగూడలో నిందితుడు పోలీసులకు చిక్కాడు.
ఈ క్రమంలో పూర్తి విచారణ జరిపేందుకు పోలీసులకు అవకాశం లభించలేదు. దీంతో కేసుకు సంబంధించి మరిన్నీ వివరాలు రాబట్టేందుకు ఉదయ్ కృష్ణారెడ్డిని ఏడు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు రెండు రోజులు మాత్రమే పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. శుక్రవారం (ఆగస్ట్ 7) సాయంత్రం 5 గంటలతో పోలీసులకు కోర్టు ఇచ్చిన గడువు ముగిసింది.
అయితే, రెండు రోజుల కస్టడీలో ఉదయకృష్ణ రెడ్డి నోరు మెదపలేదని.. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు నిరాకరించాడని పోలీసులు తెలిపారు. దీంతో ఉదయకృష్ణ రెడ్డిని మరోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఉప్పరపల్లి కోర్టులో శనివారం (ఆగస్ట్ 8) ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
