9/11 తరహా కుట్రను అడ్డుకున్నాడు.. పైలట్ స్మిత్ మచ్చర్ ను గ్రేట్ అంటూ నెతన్యాహు కితాబు

9/11 తరహా కుట్రను అడ్డుకున్నాడు.. పైలట్ స్మిత్ మచ్చర్ ను గ్రేట్ అంటూ నెతన్యాహు కితాబు

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో  విరోచితంగా పోరాడిన ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చర్ ను ప్రపంచ దేశాల నేతలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ ఘటనలో మచ్చర్ ప్రదర్శించిన ధైర్య సాహసాలను ప్రశంసించారు  ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. మచ్చరే గనక కోపైలట్ దాడిని అడ్డుకోకపోతే పెను విపత్తు సంభవించేదని అన్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా మచ్చర్ ధైర్యంగా పోరాడి కో పైలట్ దాడిని అడ్డుకుని ఎంతో మేలు చేశారని,  ఫ్లైట్ లో ఉన్న 167 మంది ప్రయాణికులను కాపాడటమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఘోర ఉగ్రదాడి 9/11 లాంటి కుట్రను అడ్డుకున్నారని అన్నారు.  

ఫ్లైదుబాయ్ విమాన ఘటన అనంతరం మీడియాతో మాట్లాడిన నెతన్యాహు.. విమానంలో ఉన్న 167 మంది ప్రయాణికుల ప్రాణాలను మచ్చర్ కాపాడారని చెప్పారు. కో-పైలట్ ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని ప్రమాదంలోకి నెట్టేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోందని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చర్ ఎదురుతిరిగి పోరాడి దాడిని అడ్డుకున్నారని తెలిపారు.

మచ్చర్ ధైర్యం వల్ల ఇజ్రాయెల్‌కే కాకుండా ప్రపంచ విమానయాన రంగానికే ముప్పుగా మారే పెను ప్రమాదం తప్పిందని నెతన్యాహు అన్నారు. ఈ ఘటనను 9/11 తరహా భారీ విషాదంతో పోలుస్తూ.. అలాంటి విపత్తును నివారించడంలో మచ్చర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

తీవ్ర గాయాల మధ్య కూడా కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులు, సిబ్బందికి సహాయం చేసే అవకాశం కల్పించడం మచ్చర్ చూపిన అసాధారణ ధైర్యానికి నిదర్శనమని నెతన్యాహు తెలిపారు. మచ్చర్ ప్రదర్శించిన వీరోచిత పోరాటం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో దాడి వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది అధికారికంగా తేలాల్సి ఉంది.