Pakistan: జపాన్‌లోని నిస్షిన్, కోరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్థాన్ జట్టు అద్భుత విజయంతో ఫైనల్‌లోకి ప్రవేశించింది. వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కావడంతో ఇన్నింగ్స్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పాకిస్థాన్‌కు ఆరంభంలో పిచ్ పరిస్థితులు అనుకూలించలేదు. బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 రన్స్ చేసి గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదోయ్ 42 పరుగులతో రాణించి జట్టును ఆదుకున్నాడు.
తడబడినా కోలుకుని టార్గెట్ చేధించిన పాక్:
చిన్న లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాట్ తగిలింది. బంగ్లాదేశ్ స్పిన్నర్లు విజృంభించడంతో పాక్ కేవలం 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లా బౌలర్లు మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించినట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత మిగతా బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. హసన్ నవాజ్ (27), అబ్దుల్ సమద్ (30) కీలకమైన దశలో 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్థాన్‌ను విజయతీరాలకు చేర్చారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ జట్టును సురక్షితంగా గెలిపించింది.
భారత్ - పాకిస్థాన్ హోరాహోరీ ఫైనల్ జరిగేనా?:
ఈ విజయంతో పాకిస్థాన్ ఆసియా క్రీడల ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా, ఇప్పుడు అందరి చూపు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ పైనే నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే అక్టోబర్ 3వ తేదీన జరగనున్న స్వర్ణ పతక పోరులో చిరకాల ప్రత్యిధులు తలపడే ఛాన్స్ ఉంది. ఇటీవలి ఆసియా కప్ వివాదాలు, క్రీడాకారుల షేక్ హ్యాండ్ వివాదం, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ ట్రోఫీ అందజేయడం లాంటి పరిణామాలు, ఒకవేళ ఫైనల్‌లో దాయాదులు తలపడితే ఈ ఫైనల్ ఫైట్ క్రికెట్ ప్రపంచంలో హై-వోల్టేజ్‌గా మారడం ఖాయం.
