నైజీరియా కంటే దరిద్రంగా ఇండియన్ స్కూల్స్ శానిటేషన్.. 5 కోట్ల మంది పిల్లల దుస్థితిపై WHO రిపోర్ట్

నైజీరియా కంటే దరిద్రంగా ఇండియన్ స్కూల్స్ శానిటేషన్.. 5 కోట్ల మంది పిల్లల దుస్థితిపై WHO రిపోర్ట్

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బడుల్లోనే పిల్లలకు కనీస వసతులు కరువవుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయంలో భారత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, UNICEF సంయుక్తంగా విడుదల చేసిన సరికొత్త నివేదిక ప్రకారం.. పాఠశాలల్లో పారిశుద్ధ్య సేవలు లేని పిల్లల సంఖ్యలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. నైజీరియా లాంటి దేశాలకంటే కూడా మన దేశంలోనే పిల్లలు దారుణమైన పరిస్థితుల్లో చదువుకుంటున్నారని రిపోర్టు హైలైట్ చేసింది. దీంతో 5 కోట్ల మంది విద్యార్థులు స్కూళ్లలో కనీస మరుగుదొడ్డి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు రిపోర్ట్ బట్టబయలు చేసింది.

డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ అంశాలపై WHO, యూనిసెఫ్ జాయింట్ మానిటరింగ్ ప్రోగ్రామ్ "ప్రోగ్రెస్ ఆన్ డ్రింకింగ్ వాటర్, సానిటేషన్ అండ్ హైజీన్ ఇన్ స్కూల్స్ 2015-2025" పేరుతో ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24 కోట్ల మంది పిల్లలు తమ పాఠశాలల్లో ఎటువంటి పారిశుద్ధ్య సేవలు లేకుండానే చదువుకుంటున్నారని తేలింది.

నైజీరియా కంటే వెనుక భారత్.. 
పాఠశాలల్లో పారిశుద్ధ్య సేవలు లేని దేశాల జాబితాలో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నట్లు రిపోర్ట్ బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న 24 కోట్ల మంది పిల్లల్లో ఒక్క భారత్‌లోనే ఏకంగా 5 కోట్ల మంది పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా, ఇథియోపియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇండోనేషియాలు ఉన్నాయి. నైజీరియాతో పోలిస్తే భారత్‌‌లోనే ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం పరువు తీస్తోంది. గత దశాబ్ద కాలంలో పరిశుద్ధత లేని పాఠశాలల సంఖ్యను భారత్ 14 శాతం మేర తగ్గించుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

పారిశుద్ధ్యం, పరిశుభ్రత విషయంలో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. తాగునీటి సదుపాయాల కల్పనలో భారత్ కొంత పురోగతిని సాధించింది. 2025 నాటికి భారత్‌లో సుమారు కోటి 20 లక్షల మంది పిల్లలు మాత్రమే పాఠశాలల్లో తాగునీటి సేవలకు దూరంగా ఉన్నారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకింద ప్రతి పాఠశాలలోనూ తాగునీటి సౌకర్యం కల్పించే దిశగా పురోగమిస్తున్న 62 దేశాలలో భారత్ కూడా ఉంది. మన దేశంలో బేసిక్ డ్రింకింగ్ వాటర్ కవరేజ్ ఏటా 4 శాతానికి పైగా పెరగటం విశేషం.