డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదె రాజేశ్వరరావు, తన భార్య భవానీ తనను చంపాలని చూస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె తన ప్రియుడు సైదులుతో కలిసి తన హత్యకు కుట్ర పన్నిందని రాజేశ్వరరావు డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాజేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో సూర్యాపేట జిల్లా మేతే మండలం రాఘవపురం గ్రామానికి భవానీతో రాజేశర్వ రావు పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్న సమయంలో భార్య ప్రవర్తనలో మార్పులు గమనించినట్లు రాజేశ్వర రావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. భవానీకి ఖమ్మం నగరంలో కొరియర్ బాయ్ సైదులతో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరి మధ్య ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. రాజేశ్వర రావు ఇంట్లో లేని సమయంలో సైదులు ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు. అయితే వీరి వివాహేతర సంబంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని భవానీ భావించింది. భర్త లేకపోతే ప్రియుడితో కలిసి జీవితం ఆనందంగా ఉంటుందని భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
భవానీకి సైదులుతో సన్నిహిత పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కారణంగా తనను అడ్డంకిగా భావించి తన ప్రాణాలకు హాని కలిగించే ప్రణాళిక రూపొందించారని పోలీసులకు రాజేశ్వర రావు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన చాటింగ్, ఇతర ఆధారాలను సేకరించి పోలీసులకు సమర్పించినట్లు పేర్కొన్నారు. తనకు, తన ఇద్దరు కూతుర్లకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను రాజేశ్వర రావు ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
