- బెదిరింపుగా భావించిన భార్య, కుటుంబ సభ్యులు
పర్వతగిరి, వెలుగు: క్షణికావేశంలో చూస్తుండగానే ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. బెదిరింపుగా భావించిన భార్య, కుటుంబసభ్యులు చూస్తుండగానే నిండు ప్రాణాలు పోయాయి. ఈ విషాదకర ఘటన వరంగల్జిల్లా పర్వతగిరి మండలం ముంజాలకుంట తండా శివారు నర్రెంగతండాలో జరిగింది. ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...తండాకు చెందిన బానోత్ జవహర్‌లాల్(45)కు ఇద్దరు భార్యలు. 16 ఏళ్ల కింద నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన అనితను రెండో వివాహం చేసుకుని వరంగల్రంగశాయిపేటలో ఉంటున్నాడు.
కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య భూవివాదాలు నడుస్తున్నాయి. సోమవారం జవహర్‌లాల్ పొలం పనుల కోసం ఇంటికి రాగా తల్లి సాలి, మొదటి భార్య లక్ష్మి అతనితో గొడవపడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన అతను.. ఇంటికి పైకప్పుకు ఉరేసుకున్నాడు. వారు ఇదంతా బెదిరింపుగానే భావించారు. కానీ మెడకు ఉరిపడడంతో స్పాట్‌లోనే చనిపోయాడు.
కాగా ఈ గొడవను జవహర్‌లాల్ కోడలు నిషా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసింది. వీడియో రికార్డు అవుతుండగానే అతను ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
