ఏపీలో డీఎస్సీ 2025 నియామకాలపై నిరసనగా ప్రతిపక్ష వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. వైసీపీ దీక్షలను అడ్డుకుంటూ టీడీపీ నేతలు కూడా నిరసనకు దిగుతున్న క్రమంలో పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో వైసీపీ దీక్షలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. చట్ట వ్యతిరేక పని చేస్తే సహించమని.. ప్రజలను ఇబ్బంది పెట్టే నిరసనను అంగీకరించమని అన్నారు. వైసీపీ దీక్షల్లో రౌడీలు తప్ప... ఒక్క డీఎస్సీ అభ్యర్థి కూడా లేరని అన్నారు చంద్రబాబు.
బస్టాండ్లు, రహదారులపై నిరసనలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కర్నూలులో నిరసన చేపట్టినవారంతా డీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన టీచర్లేనని అన్నారు. గొడ్డలి పార్టీ చేసిన నష్టం వల్లే టీచర్లు తమ ఆత్మగౌరవం చాటుకున్నారని అన్నారు చంద్రబాబు. వైసీపీ దీక్షల్లో పాల్గొంటున్నవారు నిజమైన డీఎస్సీ అభ్యర్థులు కారని.. వారంతా రౌడీషీటర్లు అని అన్నారు చంద్రబాబు.
ALSO READ : దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబానికి BRS భారీ ఆర్థిక సాయం
గత ఐదేళ్ళలో వైసీపీ నిరుద్యోగులను మోసం చేసి.. ఇప్పుడు రాజకీయ లబ్ది కోసం డీఎస్సీ పేరుతో డ్రామాలు ఆడుతోందని అన్నారు చంద్రబాబు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని... మెగా డీఎస్సీ ప్రక్రియను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు చంద్రబాబు.
