ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా.. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో క్వాలిటీ టెస్ట్ ఫెయిలైంది తెలుసా?

ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా.. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో క్వాలిటీ టెస్ట్ ఫెయిలైంది తెలుసా?

దేశంలో ప్రముఖ వంటనూనె బ్రాండ్ ఫార్చ్యూన్ కు చెందిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంది. AWL అగ్రి బిజినెస్ తయారు చేసి విక్రయిస్తున్న ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలటంతో కంపెనీపై జరిమానా విధించింది. అయితే జరిమానా మొత్తం ఎంత అనే విషయాన్ని FSSAI వెల్లడించలేదు.

ఈ చర్యకు కారణం గోవాలో సేకరించిన వంటనూనె నమూనానే. గోవాలోని తాజ్ ఫోర్ట్ అగువాడా రిసార్ట్ అండ్ స్పా నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక లీటర్ ఫార్చ్యూన్ "Fryola" సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ సేకరించి పరీక్షలకు పంపించారు. పరీక్షల్లో ఈ ఫోర్టిఫైడ్ వంటనూనెలో ఉండాల్సిన విటమిన్ A, విటమిన్ D స్థాయులు నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో చట్టాలకు అనుగుణంగా వంటనూనె లేదని అధికారులు నిర్ధారించారు.

ల్యాబ్ రిపోర్టులను కంపెనీ సవాలు చేయడంతో ఆయిల్ శాంపిల్ ను రిఫరల్ ల్యాబ్‌లో మరోసారి పరీక్షించారు. అక్కడ కూడా ముఖ్యంగా విటమిన్ D స్థాయి నిర్దేశించిన పరిమితి కంటే చాలా తక్కువగా ఉందని నిర్ధారణ అయింది. అనంతరం సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ అనుమతితో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసును పరిశీలించిన గోవా అడ్జుడికేటింగ్ అధికారి రూల్స్ ప్రకారం AWL Agri Business Ltdపై జరిమానా విధించారు.

ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఉల్లంఘనలపై FSSAI తనిఖీలను మరింత కఠినతరం చేసింది. ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థలతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లు, ఎనర్జీ డ్రింక్స్, మద్యం తయారీ కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటోంది. వినియోగదారులకు నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన ఆహార ఉత్పత్తులు అందేలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు FSSAI చెబుతోంది.