హైదరాబాద్ : హైడ్రాలో ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ(ఆగస్టు8) హైదరాబాద్ సిటీలోని సరూర్ నగర్ స్టేడియంలో ఫిజికల్ టెస్టు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రిక్రూట్ మెంట్ లో భాగంగా ఫిజికల్ టెస్టు కోసం రాష్ట్రం నలుమూలలనుంచి యువత పెద్దఎత్తున తరలివచ్చారు. తెల్లవారు జామున నాలుగు గంటలనుంచే క్యూలో నిల్చున్నారు. ఏర్పాట్లు సరిగా లేవని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
హైడ్రాలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు 150 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డీఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు 100, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టులకు పదో తరగతి అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 35 ఏండ్లలోపు ఉండాలి. ఎంపికలో భాగంగా అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నారు. 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 50 సెకన్లలో, 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయాలి. లాంగ్ జంప్‌లో 4 మీటర్లు దూకాలి. 7.26 కిలోల షాట్‌పుట్‌ను 6 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది.
అభ్యర్థులు పదో తరగతి మెమో ఒరిజినల్, ఏదైనా గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని, డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఒరిజినల్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఫిజికల్ టెస్టులు ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
