- తాగునీటి సాకుతో సాగు నీటికి పొరుగు రాష్ట్రం ఎసరు
హైదరాబాద్, వెలుగు: ఏపీ ఇలా అడిగిందో లేదో.. వెంటనే కృష్ణా బోర్డు మీటింగ్‌కు రెడీ అనేసింది. గతంలో తెలంగాణ ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోని బోర్డు, తాజాగా నీటి వాటాలు తేల్చాలంటూ ఏపీ లేఖ రాయగానే.. ఓకే చెప్పేసింది. ఈ నెల 13న జలసౌధలో బోర్డు త్రీ మెంబర్ కమిటీ మీటింగ్నిర్వహిస్తామని శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది.
ప్రస్తుతం శ్రీశైలంలోతప్ప సాగర్‌లో నీళ్లు లేవు. శ్రీశైలంలో ప్రస్తుతం 215.81 టీఎంసీలకుగాను.. 161.29 టీఎంసీలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో వర్షాలు తక్కువగా ఉంటాయన్న అంచనాలతో కేవలం తాగునీటి అవసరాలకే వాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, ఏపీ ఇప్పటికే సాగు అవసరాలకు పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించడం మొదలు పెట్టింది.
రోజూ అర టీఎంసీ చొప్పున తీసుకెళ్తున్నది. నాగార్జునసాగర్ పరిధిలో తాగునీటి అవసరాలను తీర్చాలంటే.. శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని సాగర్‌కు తీసుకొస్తే.. తాగునీటి అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది. ఈక్రమంలో ఏపీ సాగు నీటి తరలింపుపై బోర్డు మీటింగ్‌లోనూ తెలంగాణ అధికారులు గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది.
కృష్ణాలో స్థిరంగా వరదలు..
కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాలతో వరదలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు 2 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం నమోదవుతున్నది. నాగార్జుసాగర్‌కు మాత్రం ఇంకా వరదలు మొదలు కాలేదు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు లక్షన్నర క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లో వస్తోంది. కృష్ణాలో ఫర్వాలేదనిపిస్తున్నా గోదావరిలో మాత్రం పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది.
మొన్నటిదాకా శ్రీరాంసాగర్‌కు 20 వేల క్యూసెక్కుల వరద వచ్చినా.. ఇప్పుడు సగానికి తగ్గిపోయింది. ఎల్లంపల్లికీ ఆశించిన స్థాయిలో వరదలు రావట్లేదు. అయితే, లోయర్ మానేరు డ్యామ్ పరిధిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు అధికారులు మిడ్‌మానేరు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.
