ట్రాకింగ్ డివైజ్ లేకుండానే ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్లు

ట్రాకింగ్ డివైజ్ లేకుండానే ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్లు
  • ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ కు లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ తప్పనిసరి
  • డివైజ్ ఉంటేనే ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని గతంలోనే కేంద్రం ఆదేశం
  • కేంద్ర ఆదేశాలను పట్టించుకోని రాష్ట్ర రవాణా అధికారులు
  • స్కూల్, కాలేజీ బస్సులకు వీఎల్టీడీ లేకపోవడంతో పేరెంట్స్ లో టెన్షన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజా రవాణా వాహనాలు, క్యాబ్‌‌లు, స్కూల్ బస్సులు, వ్యాన్‌‌లకు 'వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్(వీఎల్టీడీ)' లేకపోవడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలోని నిర్భయ ఘటన, మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం వంటి విషాదాల తర్వాత కేంద్ర ప్రభుత్వం రక్షణ చర్యలను మరింత కఠినతరం చేసింది.

ఇందులో భాగంగా ప్రతి రవాణా వాహనానికి వీఎల్టీడీ ఉండాలని స్పష్టం చేసింది. జీపీఎస్ ట్రాకర్ సహాయంతో వాహనం కదలికలను ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌‌లో మొబైల్ ద్వారా పర్యవేక్షించే వీలుంటుందని తెలిపింది. వాహన్ పోర్టల్‌‌లో కూడా వీఎల్టీడీ ఉంటేనే ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్ (ఎఫ్ సీ) జారీ చేసేలా మార్పులు చేసింది. ఈ నిబంధన ఇతర రాష్ట్రాల్లో కఠినంగా అమలవుతున్నప్పటికీ.. మన రాష్ట్రంలో మాత్రం రవాణా శాఖ అధికారుల అలసత్వం వల్ల అమలుకావడం లేదు.

ఒక్కో డివైజ్ అమర్చుకోవడానికి ఐదు నుంచి పది వేల రూపాయల వరకు ఖర్చవుతుందనే నెపంతో వెహికల్స్ యజమానులు వీటిని పట్టించుకోవడం లేదు. మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం జరగడం, అందులో 45 మంది ప్రయాణీకులు చనిపోవడంతో తెలంగాణలో ప్రజా రవాణా వాహనాలకు వీఎల్టీడీ విధానం అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా వాటి అమలులో రవాణా శాఖ పూర్తిగా విఫలమైంది.

ప్రయాణికుల భద్రత గాలికి

ట్రాకింగ్ డివైజ్ లేకపోవడం వల్ల హైదరాబాద్‌‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువతులు, విద్యార్థినిల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. స్కూల్, కాలేజీ వాహనాలు, క్యాబ్‌‌లలో వీఎల్టీడీలు లేకపోవడంతో అందులో ప్రయాణించే వారి లొకేషన్ గుర్తించే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు నిత్యం భయంతో గడపాల్సి వస్తోంది.

మరోవైపు, లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు లేకపోవడంతో అద్దె వాహనాల్లో సరుకుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ముఖ్యంగా సివిల్ సప్లై శాఖకు అద్దె ప్రాతిపదికన నడుస్తున్న వాహనాల్లో పీడీఎస్ బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నాయి. అలాగే.. కిడ్నాప్ కేసులు, హిట్ అండ్ రన్ ఘటనలు జరిగినప్పుడు నిందితులను వెంటనే గుర్తించి పట్టుకోవడంలో పోలీసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

.రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల అలసత్వం

నిబంధనల ప్రకారం.. వీఎల్టీడీ ఉన్న వాహనాలకు మాత్రమే రవాణా శాఖ ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలి. లేదంటే దానిని తిరస్కరించాలి. కానీ, ఆచరణలో మాత్రం అధికారులు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. డివైజ్‌‌లు లేని వాహనాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేస్తే పైస్థాయి అధికారుల నుంచి చివాట్లు తినాల్సి వస్తోందని, కొన్ని వాహనాల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయని కొందరు మోటార్ వెహికల్ ఇన్‌‌స్పెక్టర్లు (ఎంవీఐ), ఆర్టీఓ స్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ నిర్లక్ష్య ధోరణిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, వీఎల్టీడీ నిబంధనను రాష్ట్రంలో కఠినంగా అమలు చేయాలని ప్రయాణికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.