లోన్ రికవరీపై RBI కొత్త రూల్స్.. ఇక ఫోన్ బ్లాక్ చేయలేరు! గంటకు రూ.250 ఫైన్

లోన్ రికవరీపై RBI కొత్త రూల్స్.. ఇక ఫోన్ బ్లాక్ చేయలేరు! గంటకు రూ.250 ఫైన్

రికవరీ పేరుతో లోన్ తీసుకున్న వ్యక్తి మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్‌ను రిమోట్‌గా బ్లాక్ చేయడం, వాటి ఫీచర్లను నిలిపివేయడంపై RBI కీలక ఆంక్షలు విధించింది. ఆగస్టు 6న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఆ పరికరాన్ని కొనుగోలు చేయడానికి ఇచ్చిన లోన్ అయితే మాత్రమే బ్యాంకులు, లోన్ సంస్థలు డివైస్ రిస్ట్రిక్షన్ టెక్నాలజీని ఉపయోగించవచ్చు. అయితే పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ఇతర లోన్ బకాయిల పేరుతో రుణగ్రహీత మొబైల్ ల్యాప్‌టాప్‌లను రిమోట్‌గా బ్లాక్ చేయడానికి అనుమతి ఉండదని రిజర్వు బ్యాంక్ తేల్చి చెప్పేసింది. ఈ కొత్త రూల్స్ 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఆర్‌బీఐ స్పష్టం చేసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. లోన్ అగ్రిమెంట్ లో డివైస్‌పై ఆంక్షలు విధించే అవకాశం గురించి స్పష్టంగా పేర్కొని ఉండాలి. అలాగే రుణగ్రహీతకు ముందుగానే నోటీసు ఇచ్చి.. ఎలాంటి పరిమితులు విధిస్తారో వివరించాల్సి ఉంటుంది. లోన్ గడువు దాటి 30 రోజులు పూర్తయ్యే వరకు ఎలాంటి ఫీచర్‌ను కూడా నిలిపివేయకూడదు. 30 రోజుల తర్వాత కూడా వెంటనే మొత్తం డివైస్‌ను బ్లాక్ చేయకుండా.. అవసరం లేని కొన్ని ఫీచర్లను మాత్రమే దశలవారీగా రిస్ట్రిక్ట్ చేయాలి. లోన్ 60 రోజులు బకాయి అయిన తర్వాత మాత్రమే ఒప్పందంలో పేర్కొన్న పూర్తి స్థాయి పరిమితులను అమలు చేయవచ్చు. అయితే 60 రోజుల గడువు పూర్తయ్యే వరకు అవుట్‌గోయింగ్ కాల్స్‌ను కూడా ఆపటానికి వీల్లేదు.

రుణగ్రహీతల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక రక్షణలు కూడా కల్పించింది. ఇన్‌కమింగ్ కాల్స్, SMSలు, అత్యవసర SOS సేవలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదు. అలాగే ఉద్యోగానికి అవసరమైన విధంగా పరికరాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని కూడా బ్యాంకులు అడ్డుకోకూడదు. రుణగ్రహీత తన డివైస్‌పై ఎలాంటి పరిమితులు అమల్లో ఉన్నాయో ఎప్పుడైనా చూసుకునే అవకాశం ఉండాలి. అంతేకాదు.. లోన్ వసూళ్ల కోసం బ్యాంకులు, వాటి భాగస్వామ్య సంస్థలు ఫోన్‌లోని కాంటాక్ట్స్, మెసేజ్‌లు, కాల్ లాగ్స్, ఫొటోలు, లొకేషన్ హిస్టరీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడం లేదా వినియోగించడం పూర్తిగా నిషేధించింది రిజర్వు బ్యాంక్.

ALSO READ : అప్పులు చేసినోళ్లకు గుడ్ న్యూస్ 

రుణగ్రహీత బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాత ఒక గంటలోపు డివైస్‌పై విధించిన అన్ని పరిమితులను తొలగించాల్సిందేనని ఆర్‌బీఐ ఆదేశించింది. ఒకవేళ బ్యాంకు తప్పుగా డివైస్‌ను బ్లాక్ చేసినా.. డబ్బు చెల్లించిన తర్వాత కూడా ఆలస్యంగా అన్‌లాక్ చేసినా, ప్రతి గంట ఆలస్యానికి రూ.250 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిహారం మొత్తం రుణంగా ఇచ్చిన మొత్తాన్ని మించకూడదు. లోన్ పూర్తిగా తీర్చిన తర్వాత బ్యాంకులు డివైస్‌పై తమ నియంత్రణను పూర్తిగా వదులుకోవాలి. అవసరమైతే సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను ఎలా తొలగించాలో కూడా లోన్ తీసుకున్న వ్యక్తికి వివరించాలి. అలాగే ఈ అంశాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఆర్‌బీఐ అన్ని లోన్ సంస్థలను ఆదేశించింది.