కోర్టుకు వస్తారని రాత్రికి రాత్రే కూల్చేస్తారా? : హైకోర్టు

కోర్టుకు వస్తారని రాత్రికి రాత్రే కూల్చేస్తారా? : హైకోర్టు
  •     నోటీసులిచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి
  •     కోర్టులను ఆశ్రయించకుండా ప్రజలను అడ్డుకుంటారా?
  •     హైడ్రా, రెవెన్యూ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ఆక్రమణలపై నోటీసులు జారీ చేస్తే బాధితులు కోర్టులను ఆశ్రయిస్తారనే ముందస్తు ఆలోచనతో రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపడతారా అని అధికారులను హైకోర్టు నిలదీసింది. ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా అడ్డుకోవడానికే ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించింది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించకూడదని కోర్టు చెప్పడం లేదని, అయితే ఆ ప్రక్రియ చట్టప్రకారం నోటీసులు జారీ చేసిన తర్వాతే జరగాలని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నెం. 60లోని తన 350 చదరపు గజాల ప్లాటు కాంపౌండ్ వాల్‌‌తో పాటు వాచ్‌‌మెన్ గదిని హైడ్రా అక్రమంగా కూల్చివేసిందంటూ పెమ్మసాని సుధారాణి దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. 

పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.శ్రీధర్ వాదనలు వినిపిస్తూ.. కూల్చివేతలకు ముందు ఎలాంటి నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వం తమ కౌంటర్‌‌లో ఎక్కడా ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ తరఫు న్యాయవాది కాట్రం మురళీధర్‌‌రెడ్డి స్పందిస్తూ.. ఈ కూల్చివేతలలో రెవెన్యూ అధికారులకు ఎలాంటి పాత్ర లేదని తెలిపారు. సర్వే నెం. 59లోని 32 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కంచె వేసి రక్షణ చర్యలు చేపట్టాలని మాత్రమే హైడ్రాకు లేఖ రాశామన్నారు. పిటిషనర్ స్థలానికి సంబంధించి 2022లోనే హైకోర్టు అనుకూల ఉత్తర్వులు ఇచ్చిందని, ఇప్పటివరకు ఆ స్థలం జోలికి వెళ్లలేదని వివరించారు. 

ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వ స్థలాల సమాచారం కలెక్టర్, ఆర్డీవోలకు తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమే అయితే ముందస్తుగా సర్వే నిర్వహించారా.. కూల్చివేతల సమయంలో మండల సర్వేయర్ అక్కడే ఉన్నారా.. అని విచారణకు హాజరైన తహసీల్దార్‌‌ను నిలదీశారు. పిటిషనర్ కాంపౌండ్ వాల్ ప్రభుత్వ స్థలంలోనే ఉందనడానికి ఆధారాలు ఏవని ప్రశ్నించగా.. తాను గత ఫిబ్రవరిలోనే బాధ్యతలు చేపట్టానని, సర్వే విషయమై తనకు పూర్తి సమాచారం లేదని తహసీల్దార్ తెలిపారు. ఈ క్రమంలో గతంలో తహసీల్దార్‌‌గా పనిచేసిన వెంకటరెడ్డి పూర్తి రికార్డులతో కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు.