విరాట్, ధోనీని దాటేసిన సచిన్.. బ్రాండ్ వ్యాల్యూలో దుమ్మురేపిన మాస్టర్ బ్లాస్టర్

విరాట్, ధోనీని దాటేసిన సచిన్.. బ్రాండ్ వ్యాల్యూలో దుమ్మురేపిన మాస్టర్ బ్లాస్టర్

Sachin Tendulkar: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు 13 ఏళ్లు గడుస్తున్నా, భారత క్రికెట్ దిగ్గజం గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ బ్రాండ్ వాల్యూ రేసులో సరికొత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక క్రోల్ ఇండియా సెలెబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ 2025 రిపోర్ట్ ప్రకారం, అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన భారత రిటైర్డ్ క్రీడాకారుడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. 

టాప్-4లో నిలిచిన సచిన్: 
తాజా నివేదిక ప్రకారం, 53 ఏళ్ల సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ దాదాపు 125.9 మిలియన్ డాలర్లు (రూ. 1,200 కోట్లు)గా ఉంది. భారత్‌లోని అత్యధిక బ్రాండ్ వ్యాల్యూ కలిగిన టాప్-10 సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కించుకుంటున్న ఏకైక రిటైర్డ్ స్పోర్ట్స్ స్టార్ టెండూల్కర్ మాత్రమే కావడం విశేషం. ప్రస్తుతం వన్డేలు ఆడుతున్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్ లో రాణిస్తున్న మహేంద్రసింగ్ ధోనీలతో పోలిస్తే అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ సచిన్ తన తిరుగులేని క్రేజ్‌ను చాటుకుంటున్నాడు. భారత సెలబ్రిటీల జాబితాలో సచిన్ 4వ స్థానంలో కొనసాగుతున్నారు.

సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కంపెనీలు: 
గ్రౌండ్ లో ప్రదర్శించిన నమ్మకం, క్రమశిక్షణ, విశ్వసనీయతే సచిన్‌ను ప్రకటనల ప్రపంచంలో ఇప్పటికీ హాట్ ఫేవరెట్‌గా నిలబెడుతున్నాయి. అన్ని వయసుల వారికి సుపరిచితుడు కావడంతో కార్పొరేట్ కంపెనీలు అతడితో ఒప్పందాలు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ప్రస్తుతం సచిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన బ్రాండ్లు ఇవే..  

* బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)
* ఏజియస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ (Ageas Federal Life Insurance)
* అపోలో టైర్స్ (Apollo Tyres)
* ఎస్‌ఎల్ లిమిటెడ్ (SL Ltd)
* హెఫెలె ఇండియా (Hafele India)
* ల్యూమినస్ పవర్ టెక్నాలజీస్ (Luminous Power Technologies)
* టానిష్క్ (Tanishq)
* స్పిన్నీ (Spinny)
* అన్‌అకాడమీ (Unacademy)

క్రికెట్ చరిత్రలో చెరగని రికార్డులు: 
సుదీర్ఘమైన 24 ఏళ్ల కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులు క్రీడా ప్రపంచంలో అత్యంత అరుదైనవి. టెస్ట్ క్రికెట్‌లో 200 మ్యాచ్‌ల్లో ఏకంగా 15,921 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అలాగే టెస్టుల్లో 51 శతకాలతో పాటు 2,058 బౌండరీలు బాదారు. అలాగే కేవలం 300 ఇన్నింగ్స్‌ల్లోనే 15,000 టెస్ట్ పరుగుల మైలురాయిని అందుకొని ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు.