దేశంలో UPI లావాదేవీలపై భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించే అవకాశానికి వీలుగా మోడీ సర్కార్ చట్టాల్లో మార్పులు చేయడంతో కొత్త చర్చ మొదలైంది. ఈ నిర్ణయం వెనుక అమెరికా ఒత్తిడి ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వాణిజ్య పరిశోధనా సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(GTRI) కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఒత్తిడికి తలొగ్గి మోడీ సర్కార్ దేశంలోని యూపీఐ పేమెంట్ విధానాలను మార్చకూడదని.. దేశ ప్రయోజనాలు, పోటీ సామర్థ్యం, చెల్లింపుల వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాలని సూచించింది.
లోక్‌సభ ఆమోదించిన బిల్లు ఏం చెబుతోంది?
లోక్‌సభ ఇటీవల పేమెంట్ అండ్ సెటిల్మెంట్ చట్టం, 2007లో సవరణ బిల్లును ఆమోదించింది. ఈ మార్పుతో భవిష్యత్తులో ప్రభుత్వం అవసరమైతే యూపీఐతో పాటు ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలపై MDR విధించేందుకు చట్టపరమైన అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రూల్స్ ప్రకారం యూపీఐ, రూపే డెబిట్ కార్డులపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటానికి వీలు లేదు. ఈ జీరో-ఎండీఆర్ విధానం వల్లే చిన్న వ్యాపారులు, స్ట్రీట్ వెండార్స్, సాధారణ ప్రజలు ఎలాంటి అదనపు భారం లేకుండా డిజిటల్ చెల్లింపులను వినియోగిస్తున్నారని GTRI పేర్కొంది.
జీరో-ఎండీఆర్ మంచిదే.. కానీ
జీరో-ఎండీఆర్ విధానం యూపీఐ సక్సెస్ కావటానికి ప్రధాన కారణమైనప్పటికీ.. ఈ భారీ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నిర్వహించేందుకు బ్యాంకులు, NPCI, ఫిన్‌టెక్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని GTRI తెలిపింది. సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, సర్వర్ల నిర్వహణ, వివాదాల పరిష్కారం, నెట్‌వర్క్ విస్తరణ వంటి అంశాలకు నిరంతరం పెట్టుబడి అవసరమే. అయితే ఈ ఖర్చులను భరించడానికి తప్పనిసరిగా అన్ని వ్యాపారులపై MDR విధించాల్సిన అవసరం లేదని GTRI స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రోత్సాహకాలు, పెద్ద వాణిజ్య లావాదేవీలపై మాత్రమే పరిమిత ఛార్జీలు, ఇతర ఆర్థిక సేవల ద్వారా క్రాస్-సబ్సిడీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సూచించింది.
అమెరికా విమర్శలు..
ఈ చట్ట సవరణకు మరో ముఖ్యమైన నేపథ్యం అమెరికా చేసిన విమర్శలేనని GTRI వెల్లడించింది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ విడుదల చేసిన 2026 National Trade Estimate Reportలో భారత్‌కు చెందిన UPI, RuPay వ్యవస్థలతో పాటు బ్రెజిల్‌కు చెందిన Pix డిజిటల్ పేమెంట్ వ్యవస్థపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విధానాలు వీసా, మాస్టర్ కార్డ్ లాంటి విదేశీ చెల్లింపు సంస్థలకు సమాన అవకాశాలు కల్పించడం లేదని అమెరికా ఆరోపించింది. దీనిపై స్పందించిన GTRI వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ.. అమెరికా ఒత్తిడికి లొంగి భారత్ తన యూపీఐ విధానాలను మార్చకూడదని, కేవలం Visa, Mastercard వంటి విదేశీ సంస్థల లాభాల కోసం MDR తీసుకురావడం సరికాదని సూచించింది.
దేశ ప్రయోజనాలే ప్రధానం..
యూపీఐ చెల్లింపులకు సంబంధించిన డేటా అత్యంత విలువైనదని, దాన్ని భారత్‌లోనే నిల్వ ఉంచే డేటా లోకలైజేషన్ విధానాన్ని కొనసాగించాలని GTRI సూచించింది. దీనివల్ల మోసాలను గుర్తించడం, సైబర్ భద్రతను బలోపేతం చేయడం, జాతీయ భద్రతను కాపాడడం సులభమవుతుందని పేర్కొంది. యూపీఐపై ఛార్జీలు విధించాలా వద్దా అనే నిర్ణయం అమెరికా అభ్యంతరాల ఆధారంగా కాకుండా.. యూపీఐ వ్యవస్థ నిర్వహణకు అయ్యే నిజమైన ఖర్చు, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మోడీ ప్రభుత్వం తీసుకోవాలని GTRI కోరింది. అలాగే అమెరికా కంపెనీలకు ఇప్పటికే భారత డిజిటల్ పేమెంట్ మార్కెట్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసింది. అయితే మెుత్తానికి మోడీ సర్కార్ అమెరికాకు సరెండర్ అయ్యిందా అనే ప్రశ్నలు ఈ సంచలనం బయటకు రావటంతో నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి.
