జీ అధినేత సుభాష్ చంద్రకు ఎదురుదెబ్బ: లోన్స్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్.. సీబీఐ చేతిలో ఆట!

జీ అధినేత సుభాష్ చంద్రకు ఎదురుదెబ్బ: లోన్స్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్.. సీబీఐ చేతిలో ఆట!

జీ మీడియా అధినేత సుభాష్ చంద్రకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ షాక్ ఇచ్చింది. ఎస్సెల్, జీ గ్రూప్ కంపెనీల అప్పులకు సంబంధించి సుభాష్ చంద్ర వ్యక్తిగత గ్యారెంటీ బాధ్యతలపై కొనసాగుతున్న న్యాయపోరాటంలోని ప్రస్తుత పరిణామాలు ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి 4 వారాల్లోగా స్పందన తెలియజేయాలని సీబీఐని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించడంతో పాటు, బెంచ్‌ల కొరత కారణంగా తర్వాతి విచారణను వాయిదా వేసింది. సీబీఐ దర్యాప్తు ఈ కేసు విచారణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ స్పష్టం చేసింది.

సుభాష్ చంద్ర తన వ్యక్తిగత నికర విలువ రూ. 31 కోట్ల79 లక్షలుగా పేర్కొంటూ.. రుణదాతలకు రూ. 6కోట్ల 50లక్షల చెల్లింపుతో కూడిన పునరుద్ధరణ ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి 80.81 శాతం మంది రుణదాతల ఆమోదం లభించిందని తెలిపారు. అయితే ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఐడీబీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కెనరా బ్యాంక్ తదితర ప్రముఖ బ్యాంకులు ఈ ప్లాన్ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ వ్యతిరేకత మధ్యే ఎన్‌సీఎల్‌టీ సభ్యుడు నీలేష్ శర్మ ఈ ప్లాన్‌ను ఆమోదించినప్పటికీ.. మెజారిటీ అభిప్రాయం లేకపోవడంతో సెప్టెంబర్ 1న ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ ఆ ఉత్తర్వులను నిలిపివేసింది.

అంతేకాకుండా ఎల్‌ఐసీ హౌసింగ్ ఫ్రూడ్ కేసులో సీబీఐ ఇప్పటికే సుభాష్ చంద్రపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఈ వివాదంలో మరింత వేడిని పుట్టించింది. రుణదాతల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థన మేరకు.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తన ఆస్తులను అమ్మటం, బదిలీ చేయకుండా చంద్రపై ఎన్‌సీఎల్‌టీ నిషేధం విధించింది. ఈ ప్రణాళిక ఆమోదానికి కీలకమైన 61.78 శాతం ఓటింగ్ వాటాను కలిగి ఉన్న 5 సంస్థల గుర్తింపుపై కూడా తీవ్ర వివాదం చెలరేగింది. ఇవి సంబంధిత పార్టీలేనని ఆరోపణలు రాగా.. కుటుంబ విభజనలో భాగంగా ఆ వ్యాపారాలు వేరుపడ్డాయని చంద్ర తరఫు వర్గాలు వాదిస్తున్నాయి.

ALSO READ : 20 ఏళ్ల కిందకు పడిపోయిన డైమండ్స్ ధరలు..

ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్‌సీఎల్‌టీ ప్రత్యేక బెంచ్ విచారణ కొనసాగింపు సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ఐదుగురు సభ్యుల బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్ర నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. రుణదాతల హక్కులు, ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత, సీబీఐ ఎంట్రీ వంటి అంశాలతో ఈ న్యాయపోరాటం సుభాష్ చంద్రకు మరింత జటిలంగా మారుతోంది. మెుత్తానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లోన్ సెటిల్మెంట్ వ్యవహారాన్ని హోల్డ్ లో పెట్టడం, సీబీఐ కేసు పెట్టి దర్యాప్తు స్టార్ట్ చేయటం సుభాష్ చంద్రకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.