ఏమన్నా టాలెంటా.. ఏమన్నా విజనా.. రూ.4వేల 200 కోట్ల రోడ్డును ఫ్యాన్లతో ఆరబెడుతున్నరు !

ఏమన్నా టాలెంటా.. ఏమన్నా విజనా.. రూ.4వేల 200 కోట్ల రోడ్డును ఫ్యాన్లతో ఆరబెడుతున్నరు !

కాన్పూర్-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే మరమ్మతు పనుల్లో విస్తుపోయే దృశ్యం కనిపించింది. భారీ వర్షాల కారణంగా రోడ్డు కుంగిపోయి, దెబ్బతిన్న కాన్పూర్-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేను ఎలక్ట్రిక్ ఫ్యాన్లతో ఆరబెడుతున్నారు. దెబ్బతిన్న రోడ్డును బాగు చేసే ముందు.. తేమను లేకుండా చేసేందుకు దెబ్బతిన్న ప్రాంతం పొడవునా ఫ్యాన్‌లను అమర్చారు. ఈ ఫ్యాన్లతో రోడ్డును ఆరబెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.  నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పేవ్‌మెంట్ కింద ఉన్న పొరల్లోకి నీరు ఇంకి, నేల బలహీనపడి రోడ్డు కుంగిపోయింది.

ఈ మార్గం దెబ్బతినడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరమ్మతు పనులు జరుగుతున్నందున, కాన్పూర్-లక్నో మధ్య ఇరువైపులా ప్రయాణించే వాహనాలను ఒకే క్యారేజ్‌వే గుండా మళ్లిస్తున్నారు. వాహనాలను అనుమతించి.. మరో వైపు మరమ్మతు పనులు కూడా చేస్తుండటంతో ప్రయాణికులు టెన్షన్ టెన్షన్గా వెళుతున్నారు. టోల్ ప్లాజాల నుంచి వెళ్లాక.. ఎక్స్‌ప్రెస్‌వేకు రాంగ్ రూట్లో ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.

సుమారు రూ. 4,200 నుంచి రూ.4,700 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో లఖ్ నవూ-కాన్పూర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వేను నిర్మించారు. 63 కిలోమీటర్ల పొడవు, 6 -లేన్లతో నిర్మించిన ఈ హైవేను 2026, జులై 13న కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారికంగా ప్రారంభించారు. అయితే, ప్రారంభించిన 12 రోజులకే ఒకే ఒక్క వర్షానికి లఖ్ నవూ-కాన్పూర్ హైవే కుంగిపోయింది. ఉన్నావ్ జిల్లాలోని కొరారీ సమీపంలో సుమారు 5 నుంచి 7 మీటర్ల మేర రహదారి కుంగిపోయింది. కోట్లకు కోట్లు పెట్టిన నిర్మించిన నేషనల్ హైవే నిండా నెల తిరగకముందే కుంగిపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.