అనుమోదము అనే అడవిలో ప్రతి తెల్లవారుజామున ఒక తీయటి పాట వినిపించేది. ఆ పాటను చిన్నారి అనే చిన్న గువ్వ పాడేది. దాని గొంతు వింటే పూలు తలలూపుతూ ఆనందంగా నాట్యం చేసేవి. చిన్నారికి ఒక కల ఉండేది. తనకంటూ ఒక సొంత గూడు కట్టుకోవాలని. రోజూ తెల్లవారగానే బయలుదేరేది.
ఎండనక, వాననక ఒక్కో పుల్లను ఏరుకొచ్చేది. ముక్కుతో మెత్తటి దూదిపింజలను తెచ్చేది. బురదను అంటించి గోడలను గట్టిపరిచేది. నెల రోజులు శ్రమించింది. రెక్కలు నొప్పెట్టాయి. కాళ్లు అలసిపోయాయి. కానీ మనసు మాత్రం సంతోషంతో నిండిపోయింది. చివరకు గూడు తయారైంది. చిన్నదే. కానీ ప్రతి పుల్లలోనూ చిన్నారి కష్టం దాగుంది. ఈలోగా వసంత పండుగ వచ్చింది. జంతువులు, పక్షులన్నీ తమ తమ గూళ్లను, ఇళ్లను ఒకదానికొకటి చూపిస్తున్నాయి.
ఏనుగు తన విడిదిని చూపించింది. ‘‘నా విడిది చూశారా? నాలుగు ఏనుగులు పట్టేంత విశాలం!’’ గర్వంగా చెప్పింది. ఉడత తన చెట్టు తొర్రను చూపించింది. కుందేలు బొరియను చూపించింది. అందరూ ఒకరినొకరు మెచ్చుకున్నారు.చిన్నారి కూడా బిడియంగా ముందుకొచ్చింది. తన చిన్న గూడును చూపించింది.
అప్పుడే కాకి అక్కడికొచ్చింది. అది ఎప్పుడూ తనకు తానే గొప్పగా చెప్పుకునేది. అందరినీ ఎగతాళి చేయడం దానికి సరదా.గూడును చూసిన కాకి పకపకా నవ్వింది.‘‘ఇదా నీ మహా సౌధం?’’ అని వెక్కిరించింది. ‘‘నెల రోజులు కష్టపడ్డావంటే నమ్మలేకపోతున్నా! ఒక్క గాలి వీచినా ఎగిరిపోయే ఈ గడ్డిపరకల కుప్పను ‘ఇల్లు’ అంటామా చిన్నారి? నువ్వెంత చిన్నదానివో నీ బతుకు కూడా అంతే చిన్నది!’’ అనిహేళన చేసింది.
ఆ మాటలకు అక్కడున్న జంతువులన్నీ ఫక్కున నవ్వాయి. మరికొన్ని జాలిగా, మౌనంగా చూస్తూ ఉండిపోయాయి. చిన్నారి ఏమీ మాట్లాడలేదు. దాని కళ్లు చెమర్చాయి. ఆ రోజు నుంచి చిన్నారి బాధతో ఆహారం తినడం మానేసింది. తన గూట్లో ఒంటరిగా కూర్చుని రాత్రిపూట ఆకాశంలోకి చూస్తూ ఉండేది.
చందమామ వెన్నెల్లో దాని కళ్ల నీళ్లు తళుక్కుమనేవి. దాని పరిస్థితి చూసిన స్నేహితులకు బాధగా అనిపించేది. చిన్నారి మనసులో ఆ మాటలే, మాటిమాటికీ కాకి మాటలే మారుమోగేవి.
ఇది గమనించింది వివేకమ్మ గుడ్లగూబ. ఒక రాత్రి చిన్నారి గూడు దగ్గరకు వచ్చింది.
‘‘ఏమైంది బిడ్డా? నీ పాట వినిపించక వారం దాటింది’’ అని ప్రేమగా అడిగింది.
చిన్నారి కళ్లనీళ్లు పెట్టుకుంది. జరిగిందంతా చెప్పింది.
వివేకమ్మ నిట్టూర్చింది.
‘‘విను చిన్నారి. కత్తి గాయం కంటికి కనిపిస్తుంది. కొంతకాలం తరువాత అది మానుతుంది. కానీ మాట చేసే గాయం కంటికి కనిపించదు. అది ఎప్పటికీ మానదు. కాకి నిజాయితీ గలదే. మంచిదే. కాకపోతే అప్పుడప్పుడు దారి తప్పుతుంది. నేను కాకితో మాట్లాడతా దిగులుపడకు’’ అని ఓదార్చింది వివేకమ్మ.
తెల్లారగానే వివేకమ్మ కాకి దగ్గరకు వెళ్లింది.
వివేకమ్మ అంటే అడవిలోని అన్ని జంతువులకు గౌరవం. కాకి వినయంగా నమస్కారం పెట్టింది.‘‘ఓ కాకిరాజా! ఒక్క ప్రశ్న’’ అంది గంభీరంగా. ‘‘కోయిల ఎప్పుడైనా నీ కూతను వెక్కిరించిందా? ‘నీ అరుపు ఎంత వికారంగా ఉంది’ అని ఎవరైనా అన్నప్పుడు నీకెలా అనిపిస్తుంది?’’
‘‘బాధగా ఉంటుంది’’ అంది గొంతు తగ్గించి అన్నది కాకి. తప్పని దాని మనసుకు తెలుస్తోంది.
‘‘మరి ఆ నొప్పి తెలిసి కూడా, చిన్నారికి అదే నొప్పిని ఎందుకిచ్చావు?’’
‘‘నాలో లోపాన్ని తగ్గించుకోవడానికి ఎప్పుడూ ఎవరిమీదనో ఒకరిని అవమానపరుస్తాను. అలా చేస్తే అందరిలో గొప్పవాడిగా కనిపిస్తానని” అసలు సంగతి చెప్పింది కాకి. “సరే, తప్పు తెలుసుకున్నావు కదా! దిద్దుకోవాల్సిన బాధ్యత నీదే” అంది వివేకమ్మ. మరుసటి రోజు వివేకమ్మ అడవిలో పెద్ద మర్రి చెట్టు కింద సభ ఏర్పాటుచేసింది. ‘‘చిన్నారి.. నా మాటలు నిన్ను బాధ పెట్టాయి. నన్ను క్షమించు’’ పశ్చాత్తాపంతో కాకి క్షమాపణలు చెప్పింది.
‘‘కాకిరాజా అలాగే క్షమిస్తాను, కానీ ఇకపై ఎవరినీ అవమానించొద్దు’’ కోపంగా అన్నది చిన్నారి
“అలాగే చిన్నారి. ఈ ఒక్కసారికి నా తప్పును మన్నించు” అంటూ చేతులు జోడించడంతో చిన్నారి నవ్వింది.
- శీలం భద్రయ్య
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీ పత్రంతో పాటు [email protected] కి మెయిల్ చేయండి.
