చేతిలో డబ్బుల్లేక చదువు మధ్యలో ఆగిపోకూడదు.. పేదరికం కారణంగా ప్రతిభ మరుగున పడకూడదు.చదువుకోవాలనే తపన ఉంది... కానీ ఆర్థిక స్థోమత లేదు.. కలలు ఉన్నాయి.. వాటిని సాకారం చేసుకునే అవకాశం లేదు. అందుకే ‘జకాత్’ నిధులతో తెలంగాణలోని వేలాదిమంది అనాథలు, నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తూ.. వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది హైదరాబాద్ నగరంలోని జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. ఒకరి దానం.. ఓ విద్యార్థి చదువుకు బాట. ఒక స్కాలర్‌షిప్.. ఓ కుటుంబానికి భవిష్యత్తు. అలా పొందిన ఉపకార వేతనాలతో అనాథలు, నిరుపేదలు కూడా ఉన్నత విద్య అభ్యసించి, ఉద్యోగాలు సాధించి విజయ శిఖరాలను అధిరోహించారు.
బేగంపేటలోని హైదరాబాద్ జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ 1993వ సంవత్సరంలో ప్రారంభమై మూడు దశాబ్దాలకు పైగా అత్యుత్తమ సేవలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 2,05,896 మంది అనాథ, పేద విద్యార్థులకు రూ.68 కోట్లకు పైగా స్కాలర్‌షిప్‌లు అందించి వారి ఉన్నత విద్యకు అండగా నిలిచింది. ప్రతీ ఏటా రమజాన్ నెలలో దాతల నుంచి జకాత్ రూపంలో అందే విరాళాలతో ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది ట్రస్ట్. సిటీలోని కొందరు దాతలు నగదు, బంగారం, వెండి, పెట్టుబడులు, వ్యాపార లాభాలు, ఆస్తులపై 2.5 శాతం మొత్తాన్ని జకాత్ విరాళంగా ట్రస్టుకు అందిస్తున్నారు. జకాత్ నిధులను పేద విద్యార్థుల చదువునకు వెచ్చించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. 2026- – 27 విద్యా సంవత్సరంలో కూడా10 వేల మందికి పైగా విద్యార్థులకు ఈ ట్రస్ట్ రూ.5 కోట్ల ఉపకార వేతనాలు అందిస్తోంది.
పేద విద్యార్థులకు ట్రస్ట్ అండదండలు
స్కాలర్‌షిప్‌తో చదువుకుని జీవితంలో స్థిరపడిన అనాథలు, నిరుపేద విద్యార్థుల విజయగాథలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్ట్ అర్హత గల విద్యార్థికి అండగా నిలచి విద్యను అందుబాటులోకి తీసుకువస్తోంది. ట్రస్ట్ స్కాలర్‌షిప్ ప్రాజెక్ట్ ద్వారా అనాథ, నిరుపేద విద్యార్థులకు ఆర్థికసాయం అందించడం ద్వారా వారు తమ విద్యా ఆకాంక్షలను కొనసాగించి, వారి కలలను సాకారం చేసుకుంటున్నారు.
అనాథలకు స్కాలర్‌షిప్ స్కీం
అనాథ విద్యార్థుల విద్య కోసం ఈ పథకాన్ని ట్రస్ట్ రూపొందించింది. ఈ స్కీం కింద తెలంగాణలో అనాథ పిల్లలకు ఎల్కేజీ నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్ వరకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేయడాన్ని నివారించడం, ఈ విద్యార్థులకు వారి విద్యా ప్రయాణం అంతటా మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా 12,000 మందికి పైగా అనాథ విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ట్రస్టు నుంచి లబ్ధి పొందుతున్నారు. ట్రస్ట్ దీని కోసం ఏటా రూ.3 కోట్లు ఖర్చు చేస్తుందని ట్రస్ట్ ప్రతినిధి నిస్కార్ చెప్పారు.
వైద్య విద్యార్థులకు ఉపకారవేతనాలు
వృత్తి రంగాల్లో ప్రతిభను పెంపొందించడం, ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించడానికి ప్రత్యేకంగా ఈ స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని ట్రస్ట్ ప్రారంభించింది. వృత్తి విద్యా కోర్సుల స్కాలర్‌షిప్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో మెడిసిన్, ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ, లా వంటి కోర్సులను అభ్యసిస్తున్న ప్రతిభ గల విద్యార్థులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా తతట్రస్ట్ పెట్టుకుంది. ఈ కార్యక్రమం విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల భారం లేకుండా వారు ఎంచుకున్న వృత్తిని కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ పథకానికి రూ.35 లక్షల మొత్తాన్ని కేటాయిస్తున్నట్లు హైదరాబాద్ జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి చెప్పారు.
హైదరాబాద్ జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ స్కాలర్ షిప్ లు అందించడంతోపాటు నిరుపేద వర్గాలకు సేవ చేయడానికి, వారి విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం సాయం చేస్తుంది. పేదలకు ఆహార పంపిణీ ప్రాజెక్ట్ కింద మారుమూల గ్రామాల్లోని పాఠశాలలకు, వితంతువులకు, పేద కుటుంబాలకు ఆహారధాన్యాల కిట్లను పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో వితంతువులకు, అనాథలకు వస్త్రాలను పంపిణీ చేస్తున్నారు. భూకంపాలు, వరదలు, సునామీలు, కొవిడ్-– 19 మహమ్మారి బారిన పడిన బాధితులకు ట్రస్టు సాయం అందించింది. ప్రభావితమైన వారికి ఉపశమనం కలిగించడానికి వారి జీవితాలను పునర్నిర్మించడంలో సాయపడటానికి మేము కృషి చేస్తాం. అనాథ బాలికలు, వితంతువుల వివాహాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని ట్రస్ట్ ప్రతినిధి బాబా చెప్పారు.నిన్న స్కాలర్‌షిప్ కోసం ఎదురుచూసిన విద్యార్థులే..నేడు ఉన్నత విద్యను పూర్తి చేసి ఉద్యోగాలు సాధిస్తూ తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
దివ్యాంగుడి విజయగాథ
తెలంగాణకు చెందిన ఎం.వెంకట్ అప్పా పోలియో వల్ల కాళ్లు లేకపోయినా, చదువుకునేందుకు డబ్బు లేకపోయినా నిరాశ చెందలేదు. దివ్యాంగుడైన వెంకట్ అప్పాకు జకాత్ ట్రస్ట్ మూడేళ్లపాటు స్కాలర్‌షిప్ అందించడంతో పట్టుదలగా కష్టపడి చదివి తన విద్యా నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. డిగ్రీ పూర్తి కాగానే తనకున్న ప్రతిభతో పోటీ పరీక్ష రాసి కేంద్ర ప్రభుత్వ అధికారిగా ఎంపికై పనిచేస్తున్నారు. ఈ పదవి ఆయనకు వృత్తిపరమైన సంతృప్తిని ఇవ్వడమే కాకుండా స్థిరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని కూడా అందిస్తోంది. జకాత్ ట్రస్ట్ చేయూతతో సమస్యలను అధిగమించి ఉన్నత ఉద్యోగం పొందిన వెంకట్ అప్పా విజయతీరానికి చేరారు.
పట్టుదలతో డాక్టరైంది!
ఖమ్మం నగరానికి చెందిన నయీమ్ సుల్తానాది నిరుపేద కుటుంబం. సాధారణ టీ విక్రేత కుమార్తె అయిన సుల్తానా, డాక్టర్ కావాలనేది ఆమె కల. ఆ సంకల్పంతోనే నీట్ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు పొందింది. సుల్తానా ఆశయానికి జకాత్ ట్రస్ట్ అండగా నిలిచింది. అంతే ఎంబీబీఎస్, గైనకాలజీలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సొంతంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్యసేవలందిస్తోంది. అంకితభావం, దృఢ సంకల్పం, అచంచలమైన మద్దతు ఉంటే ఏ అడ్డంకినైనా అధిగమించి మన కలలను సాకారం చేసుకోవచ్చని డాక్టర్ సుల్తానా కథ మనకు గుర్తు చేస్తుంది.
స్కాలర్‌షిప్‌తో చదివి టీచర్‌గా..
సూర్యాపేట జిల్లా కొమ్మరబండ గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు దివంగత షేక్ జాన్ సాబ్ కుమారుడైన షేక్ చాంద్ పాషా విద్య పట్ల నిబద్ధతతో చదివి ప్రభుత్వ సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఎంపికయ్యారు. ఒక కుటుంబం విద్య పట్ల చూపే నిబద్ధత సమాజంపైనా, తర్వాతి తరంపైనా ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఆయన ప్రయాణం ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. బోధన పట్ల అంకితభావంతో యువతరాన్ని ప్రేరేపించి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, ఒక శాశ్వత వారసత్వాన్ని సృష్టించగలవని చంద్ పాషా కథ గుర్తు చేస్తుంది.
