మొయినా బాద్ లోని హరీశ్, రోహిత్ ఫామ్ హౌస్ ల దగ్గర హైటెన్షన్

మొయినా బాద్ లోని  హరీశ్, రోహిత్ ఫామ్ హౌస్ ల దగ్గర హైటెన్షన్

 రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఆదివారం భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అజీజ్‌నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు చెందిన ఫామ్‌హౌస్ వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు.

ఇదే సమయంలో మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్‌హౌస్‌ను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాభవన్ నుంచి బయలుదేరి రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌ను సందర్శించనున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మూడో రోజు బీఆర్ఎస్ నేతల ఆస్తులపై ఫీల్డ్ విజిట్ కొనసాగుతోంది. 

 ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఫామ్‌హౌస్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పర్యటన నేపథ్యంలో మొయినాబాద్‌లో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.