జపాన్ షూటర్‌తో లాస్ట్ షాట్ వార్.. ఎలవెనిల్‌కు సిల్వర్: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

జపాన్ షూటర్‌తో లాస్ట్ షాట్ వార్.. ఎలవెనిల్‌కు సిల్వర్: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

Elavenil Valarivan: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లో భారత షూటర్లు కిరాక్ బోణీ కొట్టారు. ఈరోజు (సెప్టెంబర్ 20, ఆదివారం) జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత యంగ్ షూటర్ ఎలవెనిల్ వలరివాన్ (Elavenil Valarivan) అద్భుత ప్రదర్శనతో రజత పతకం (Silver Medal) సాధించింది. చివరి షాట్ వరకు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ పతకాల పోరులో లాస్ట్ నిమిషంలో గోల్డ్ మెడల్ చేజారినప్పటికీ, భారత్‌కు విలువైన వెండి పతకాన్ని అందించింది. ఫైనల్ రౌండ్ ప్రారంభం నుంచే ఎలవెనిల్ తన ఖచ్చితమైన లక్ష్యంతో అగ్రస్థానంలో కొనసాగింది.

చివరి షాట్ వరకు తీవ్ర ఉత్కంఠ: 

* ఆధిపత్యం: మొదటి సిరీస్‌లోనే 53.1 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. 10 షాట్లు పూర్తయ్యేసరికి 106.0 పాయింట్లతో లీడ్‌ను కాపాడుకుంది.

* ఎలిమినేషన్ రౌండ్స్: వరుసగా 10.6, 10.8, 10.7 వంటి పర్ఫెక్ట్ షాట్లు కొడుతూ చైనా, దక్షిణ కొరియా ప్లేయర్లకు షాకిచ్చింది. 20 షాట్ల తర్వాత 211.1 పాయింట్లతో స్వర్ణ పతకం దిశగా దూసుకెళ్లింది.

* ఆఖరి షాట్‌లో ట్విస్ట్: జపాన్‌కు చెందిన హినాటా తైచీ తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. 22 షాట్లు ముగిసేసరికి హినాటా (232.2) కంటే ఎలవెనిల్ (231.9) కేవలం 0.3 పాయింట్ల వెనుకంజలో నిలిచింది. డిసైడింగ్ చివరి షాట్‌లో ఎలవెనిల్ 10.1 పాయింట్లు సాధించగా, జపాన్ షూటర్ 10.2 పాయింట్లు కొట్టి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన బాన్ హ్యోజిన్ కాంస్యం సాధించగా, మరో భారత షూటర్ సోనమ్ మస్కర్ 6వ స్థానంతోనే సరిపెట్టుకుంది.

టీమ్ ఈవెంట్‌లోనూ రజత పతకం: 

ఫైనల్‌కు ముందే షూటింగ్ విభాగంలో భారత్ మొదటి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఎలవెనిల్ వలరివాన్, సోనమ్ మస్కర్, విదార్సా వినోద్‌లతో కూడిన భారత త్రయం అద్భుత ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకుంది.

మిగిలిన ఈవెంట్లలోనూ భారత్ జోరు: 

* MMA: మహిళల ట్రెడిషనల్ 60 కేజీల క్వార్టర్ ఫైనల్లో సుచికా తరియాల్ మంగోలియా ప్లేయర్ అల్తాన్‌చిమెగ్ బైగల్మాపై గెలిచి పతకాన్ని ఖాయం చేసుకుంది.

* హాకీ: పూల్-బి మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు ఉజ్బెకిస్థాన్‌ను 19–0 తేడాతో చిత్తు చేసి చారిత్రాత్మక విజయం సాధించింది.

* టేబుల్ టెన్నిస్: గ్రూప్-ఎఫ్ మ్యాచ్‌లో ఇండోనేషియాను 3–0తో ఓడించి భారత మహిళల జట్టు శుభారంభం చేసింది.