గణపయ్యకు మూడు రోజుల్లో రూ.3 కోట్లు డొనేషన్స్.. ముంబై లాల్‌బాగ్‌చా రాజా రికార్డ్

గణపయ్యకు మూడు రోజుల్లో రూ.3 కోట్లు డొనేషన్స్.. ముంబై లాల్‌బాగ్‌చా రాజా రికార్డ్

ముంబైలో అత్యంత వైభవంగా జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో 'లాల్‌బాగ్‌చా రాజా' స్థానమే వేరు. భక్తుల కొంగు బంగారంగా, కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి గాంచిన ఈ సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ మండలాన్ని 1934లో స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు, గణేశుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఈ చారిత్రక ప్రాముఖ్యత ఉన్న లాల్‌బాగ్‌చా రాజా దర్బార్‌లో ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా భక్తుల నుంచి కానుకల వర్షం కురుస్తోంది.

ప్రస్తుత గణేశోత్సవాల తొలి 3 రోజుల్లోనే లాల్‌బాగ్‌చా రాజా గణేష్ మండలానికి రూ. 3కోట్ల18 లక్షలు విలువైన కానుకలు వచ్చినట్లు మేనేజింగ్ కమిటీ వెల్లడించింది. ఇందులో కేవలం నగదు రూపంలోనే రూ. కోటి 90 లక్షలు వచ్చాయి. అలాగే భక్తులు సమర్పించిన కానుకల్లో 647.47 గ్రాముల బంగారం దీని విలువ సుమారు రూ.98లక్షల 90వేలు, అలాగే కేజీ 240 గ్రాముల వెండి విలువ సుమారు రూ.30లక్షల 35వేలుగా ఉంది. బంగారు గాజులు, గొలుసులతో పాటు వెండితో చేసిన పెన్స్, క్రికెట్ బ్యాట్లు వంటి ప్రత్యేక వస్తువులు కూడా విరాళాల రూపంలో వచ్చాయి. ఇవి కాకుండా అమెరికన్ డాలర్లు తదితర విదేశీ కరెన్సీలు కూడా హుండీలో లభించాయి.

సెప్టెంబర్ 14న ప్రారంభమైన వినాయక ఉత్సవాలు ఈ నెల 25న అనంత చతుర్దశి రోజున గణేష్ విసర్జనతో ముగియనున్నాయి. ప్రతిరోజూ పూజా కార్యక్రమాల అనంతరం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యుల సమక్షంలో ఈ విరాళాల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోంది. హుండీ ద్వారా వచ్చే నగదును బ్యాంకులో జమ చేసి, ఏడాది పొడవునా వివిధ సామాజిక, సేవా కార్యక్రమాల నిర్వహణకు వినియోగిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

ఈసారి ఉత్సవాలతో పాటు సామాజిక బాధ్యతకు కూడా మండలం పెద్దపీట వేసింది. బీఎంసీతో కలిసి ప్రసాదం తయారీ విభాగంలో వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపట్టింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ముంబైలోని నాలుగు ఆసుపత్రుల్లోని బయోమెతనేషన్ ప్లాంట్లకు పంపి.. దాదాపు 7744 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక సాధారణ భక్తులతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబం, అంబానీ కుటుంబ సభ్యులు, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి ప్రముఖులు కూడా లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.