టాలీవుడ్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్పై మాదాపూర్ పోలీసు స్టేషన్లో ల్యాండ్ కబ్జా ఫిర్యాదు నమోదైంది. మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతాల్లో తమ ల్యాండ్ కబ్జా చేశాడని మాదాపూర్ పోలీసులకు సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ ఫిర్యాదు చేశారు.
సర్వే నెంబర్ 12,12ఏ, 13 గుట్టల బేగంపేట్లో తమ ప్లాట్స్ ఉన్నాయని ప్లాట్ ఓనర్స్ తెలిపారు. శనివారం ఉదయం ఫిల్మ్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్, ఇతర వ్యక్తులు తమ ప్లాట్స్లోకి అక్రమంగా ప్రవేశించి బ్లూ షీట్స్ వేశారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
తమ ప్లాట్స్లోకి వెళ్లకుండా అక్రమంగా షీట్స్ వేసి అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో ప్లాట్ ఓనర్స్ పేర్కొన్నారు. గతంలో కూడా తమ ప్లాట్స్ కబ్జాకు యత్నించిన వ్యక్తులపై ఫిర్యాదు చేశామని, అప్పటి నుంచి తమ జోలికి రాకుండా ఉన్నారని సొసైటీ సభ్యులు తెలిపారు.
తాజాగా తమ ప్లాట్స్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న సి. కళ్యాణ్, ప్రకాష్ ధారక్, ప్రేమలత అనే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మాదాపూర్ పోలీసులను ప్లాట్ ఓనర్స్ కోరారు.
