World Of Vettuvam: ఆర్య, శోభితల ‘వెట్టువం’.. ప్రతి పాత్ర వెనుక ఓ యుద్ధం.. పా. రంజిత్ సృష్టించిన ప్రపంచం ఇదే!

World Of Vettuvam:  ఆర్య, శోభితల ‘వెట్టువం’.. ప్రతి పాత్ర వెనుక ఓ యుద్ధం.. పా. రంజిత్ సృష్టించిన ప్రపంచం ఇదే!

తమిళ సినీ పరిశ్రమలో తనదైన కథనం, విభిన్నమైన మేకింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న  డైరెక్టర్ పా. రంజిత్ మరో ఆసక్తికరమైన ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. స్టార్ హీరో ఆర్య, వి.ఆర్. దినేష్, టాలీవుడ్ బ్యూటీ శోభితా ధూళిపాళ, కలైయరసన్, మైమ్ గోపీ, గురు సోమసుందరం, షబీర్ కల్లారక్కల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘వెట్టువం’ (Vettuvam)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ‘World Of Vettuvam’ వీడియో సినిమాకు సంబంధించిన కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆసక్తిని మరింత పెంచింది. ముఖ్యంగా సినిమా నేపథ్యం, పాత్రల కోసం నటీనటులు చేసిన కఠోర శిక్షణ, యాక్షన్ సన్నివేశాల కోసం పడిన శ్రమ ఈ వీడియోలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.

‘వెట్టువం’ కథ మూడు విభిన్న కాలపరిమాణాల నేపథ్యంలో సాగనున్నట్లు వీడియోలో చూపించారు. గతం, వర్తమానం, భవిష్యత్తు మధ్య సంబంధాన్ని చూపిస్తూ.. భూమి, అధికారం, మనుగడ వంటి అంశాలను కథలో ప్రధానంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పా. రంజిత్ తనదైన శైలిలో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా కథాంశానికి సంబంధించిన పూర్తి వివరాలను రానా వీడియోలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికితోడు ఈ వీడియోలో కనిపించిన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

మల్లఖంబ క్రీడ.. కథలోని సంఘర్షణ

ఈ సినిమాలో మల్లఖంబ (Mallakhamba) అనే సంప్రదాయ భారతీయ క్రీడకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. చెక్క స్తంభం లేదా తాడుపై శరీర సమతుల్యత, బలం, చురుకుదనంతో చేసే ఈ క్రీడను సినిమాలోని పోరాట ప్రపంచంతో ముడిపెట్టారు. ఒక కీలకమైన అధికార పదవిని దక్కించుకునేందుకు జరిగే పోటీకి ఈ క్రీడ ఆధారంగా నిలిచినట్లు సమాచారం. దీంతో మల్లఖంబ కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే కాకుండా, కథలోని సంఘర్షణకు కూడా ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది.

పాత్రల కోసం నటీనటుల కఠోర శిక్షణ..

‘World Of Vettuvam’ వీడియోలో నటీనటుల శిక్షణకు సంబంధించిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్య, వి.ఆర్. దినేష్, శోభితా ధూళిపాళ, షబీర్ కల్లారక్కల్ తదితరులు మల్లఖంబ, స్వీయరక్షణ పద్ధతుల్లో శిక్షణ పొందినట్లు వీడియోలో చూపించారు. సినిమాలోని పాత్రలకు అనుగుణంగా శారీరకంగా సిద్ధమవ్వడం, క్లిష్టమైన కదలికలను అభ్యసించడం వంటి అంశాలపై నటీనటులు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

►ALSO READ | Ee Paata Korinavaaru Review: టాలీవుడ్‌లోనే లాంగెస్ట్ టైటిల్ మూవీ.. ‘ఈ పాట కోరినవారు...’ రివ్యూ

ప్రతి పాత్రకు ప్రత్యేకమైన నేపథ్యం, శారీరక భాష, నటన అవసరమయ్యేలా దర్శకుడు పా. రంజిత్ ఈ ప్రపంచాన్ని రూపొందిస్తున్నట్లు ఈ ఫస్ట్ గ్లింప్స్ సూచిస్తోంది. అయితే నటీనటులు పోషిస్తున్న పాత్రల పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

పా. రంజిత్ మార్క్‌తో మరో కొత్త ప్రయోగం..

‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంబరై’ వంటి చిత్రాలతో తనదైన కథన శైలిని ప్రదర్శించిన పా. రంజిత్.. ‘వెట్టువం’తో మరో వినూత్న ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక అంశాలు, బలమైన పాత్రలు, ప్రత్యేకమైన దృశ్య ప్రపంచాన్ని కలిపి కథను చెప్పడం ఆయన సినిమాల్లో కనిపించే ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి. ఈ చిత్రంలోనూ యాక్షన్‌తో పాటు కథా నేపథ్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇంపాక్ట్ తీసుకొచ్చిన రానా..

తెలుగు ఆడియన్స్ కోసం ‘వెట్టువం’ ప్రపంచాన్ని పరిచయం చేసే బాధ్యతను హీరో రానా వాయిస్ ఓవర్ ద్వారా ఇంపాక్ట్ తీసుకొచ్చారు. రానా గంభీరమైన స్వరం, పరిచయ వీడియోలోని విజువల్స్‌కు మరింత ప్రభావాన్ని తీసుకొచ్చింది. టెక్నికల్‌గా కూడా ‘వెట్టువం’ ఒక భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రంగా కనిపిస్తోంది. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రూపేష్ షాజీ సినిమాటోగ్రఫీ, సెల్వ ఆర్.కె. ఎడిటింగ్, ఎస్.ఎస్. మూర్తి ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీని దిలీప్ సుబ్బరాయన్ చూసుకుంటున్నారు.

మొత్తంగా మూడు కాలాల నేపథ్యం, మల్లఖంబ పోటీ, అధికారం కోసం జరిగే సంఘర్షణ, పాత్రల కోసం నటీనటుల కఠోర శిక్షణ వంటి అంశాలతో ‘వెట్టువం’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పా. రంజిత్ సృష్టించిన ఈ ప్రపంచంలో పాత్రల ప్రయాణం ఎలా ఉండబోతోంది? కథలోని సంఘర్షణ ఎలాంటి మలుపులు తీసుకోనుంది? అనేది సినిమా విడుదల తర్వాతే పూర్తిగా తెలియనుంది.