టాలీవుడ్ చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌తో తెరకెక్కిన సినిమాగా ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ రికార్డుల్లో నిలిచింది. ఈ చిత్రానికి ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘ఆటగదరా శివా’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కించారు. దివంగత దర్శకుడు, రచయిత మదన్ (పెళ్లైన కొత్తలో ఫేమ్) అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా చంద్ర సిద్ధార్థ్ స్వయంగా నిర్వహించారు.
టాలీవుడ్‌లోనే అత్యంత పొడవైన టైటిల్‌తో తెరకెక్కిన సినిమా అంటే సహజంగానే అందరిలో ఆసక్తి కలుగుతుంది. ఇంత పెద్ద టైటిల్ పెట్టిన ఈ సినిమా అసలు ఎలా ఉంది? కథలో అంతే కొత్తదనం ఉందా? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం..
కథేంటంటే:
సాగర్ (హర్ష) ఒక మానసిక సమస్య ఉన్న వ్యక్తి. అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ఏపీలోని ఓ గెస్ట్ హౌస్‌లో దాము (అశోక్ వర్ధన్), నీలి (రేఖా నిరోషా)లను నియమిస్తాడు అమెరికాలో డాక్టర్, అన్నయ్య శివాజీ (రవివర్మ). రోజు రాత్రి 10:30 గంటలకు రేడియోలో 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు' అంటూ ఒకే పాట వినిపిస్తుంటుంది. ఆ పాట విన్నప్పుడల్లా తన చుట్టూ దెయ్యం ఉందేమోనని సాగర్ భయపడుతుంటాడు.
దాము, నీలి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో రేడియోలో రోజూ ఆ పాట ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి విజయవాడలోని రేడియో స్టేషన్‌కు వెళ్తాడు సాగర్. అక్కడ ఆర్జే కావేరి (ఇనాయా సుల్తానా) ఆరు నెలలుగా ఆ పాట ప్లే చేయమని వస్తున్న పోస్ట్ కార్డులను చూపుతుంది. కాకినాడ సమీపంలోని తిమ్మాపూర్ దగ్గర ఉన్న ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లిన సాగర్‌కు అక్కడ అసలు నెమలిపాలెం అనే ఊరే లేదని తెలుస్తుంది. ఆ తర్వాత సాగర్‌కు రమ (అమైరా గోస్వామి) ఎలా పరిచయమైంది? ఐదుగురు సభ్యులతో కూడిన మ్యూజికల్ బ్యాండ్ వెనుక ఉన్న కథ ఏంటి? చివరికి సాగర్ నిజం కనిపెట్టాడా? లేదా? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ:
‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’ వంటి క్లాసిక్స్ అందించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్, చాలా రోజుల తర్వాత తన మార్కుకి భిన్నంగా తీసిన ప్రయోగాత్మక మ్యూజికల్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఫస్టాఫ్ సాగర్ భయపడే సీన్స్, దాము - నీలి మధ్య పులగం చిన్నారాయణ రాసిన కామెడీ పంచ్ డైలాగ్స్‌తో సరదాగా సాగుతుంది. రేడియో పాట వెనుక ఉన్న రహస్యం కోసం సాగర్ వెతికే క్రమంలో ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ మ్యూజికల్ బ్యాండ్, ప్రేమలు, గొడవల చుట్టూ రొటీన్ ఫార్మాట్‌లో సాగినా, కథ చివర్లో ఇచ్చే ఊహించని ట్విస్ట్‌లు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇలా మొత్తానికి.. పొడవైన టైటిల్‌తో ప్రయోగంగా వచ్చిన 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి..' పాయింట్ బావుంది. ఫస్టాఫ్ ఎంగేజ్ చేసింది. సెకండాఫ్ కాస్త మైనస్ అయ్యింది. థియేటర్ల కంటే ఓటీటీలో కుటుంబంతో చూసేందుకు పర్వాలేదు. ఈ మ్యూజికల్ థ్రిల్లర్ తక్కువ అంచనాలతో వెళితే తప్పకుండా మెప్పిస్తుంది.
ALSO READ : మగాళ్లకూ సమస్యలుంటాయ్ బాస్.. ‘మగాళ్లు జిందాబాద్’ టీజర్ అదిరిందిగా
నటీనటుల పనితీరు:
రెండు వేరియేషన్స్ ఉన్న హీరో పాత్రలో హర్ష మెప్పించాడు. అమైరా గోస్వామి తన లుక్స్, ఎమోషనల్ నటనతో ఆకట్టుకోగా... సుజనా రెడ్డి గ్లామర్‌తో రిజిస్టర్ అయింది. రోమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రేఖా నిరోషా అలరించింది. రవివర్మ, ఇనాయా సుల్తానా, అశోక్ వర్ధన్ తమ పరిధి మేర నటించారు.
టెక్నీకల్గా..
జే రెక్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పదే పదే వినిపించే ఆ పాట బాగున్నాయి. 1995 కాలాన్ని ప్రతిబింబించేలా సినిమాటోగ్రఫీ సాగింది. మొదటి 20 నిమిషాల సాగదీత, ఏఐ విజువల్స్ సరిగ్గా కుదరకపోవడం, అత్యంత పొడవైన టైటిల్ సినిమాకు మైనస్‌లుగా నిలిచాయి. దర్శకుడు చంద్ర సిద్ధార్థ్.. ఈసారి మ్యూజికల్ మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకర్షించారు. సింపుల్ పాయింట్‌ను మిస్టరీ, ఎమోషన్స్, మ్యూజిక్‌తో ముడిపెడుతూ కథను నడిపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు.
