Movie Review: కూతుళ్ల పెంపకంపై ప్రేయసి రావే డైరెక్టర్ మూవీ.. ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ ఎలా ఉందంటే?

Movie Review: కూతుళ్ల పెంపకంపై ప్రేయసి రావే డైరెక్టర్ మూవీ.. ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ ఎలా ఉందంటే?

‘ప్రేయసి రావే’, ‘అయోధ్య రామయ్య’, ‘చెప్పాలని ఉంది’, ‘జోరుగా హుషారుగా’, ‘ఒక్కడే’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ చంద్ర.. కొంత విరామం తర్వాత తెరకెక్కించిన చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు నటించిన ఈ సినిమా ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 18, 2026న) థియేటర్లలోకి వచ్చింది. దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ముగ్గురు తండ్రులు తమ కూతుళ్లను మూడు రకాలుగా పెంచడం.. ఆ పెంపకం పిల్లల ఆలోచనలు, నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని కథగా తీసుకున్నారు. మరి ఈ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూసేద్దాం.. 

కథేంటంటే: 

పిఠాపురం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వీర రాఘవ (రాజేంద్రప్రసాద్), విశ్వనాథం (కేదార్ శంకర్), బంగారయ్య (పృథ్వీరాజ్) మంచి స్నేహితులు. వీర రాఘవ ఊరి ప్రెసిడెంట్‌గా ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉంటాడు. పిల్లలకు ఏది మంచో, ఏది చెడో అర్థమయ్యేలా చెప్పడమే ముఖ్యమని భావిస్తాడు. విశ్వనాథం మాత్రం స్కూల్ టీచర్ కావడంతో క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. చదువులో మంచి మార్కులు రావాలని కూతురిపై ఒత్తిడి పెడుతుంటాడు. మరోవైపు బంగారయ్య డబ్బున్న వ్యక్తి కావడంతో తన కూతురికి ఎలాంటి లోటూ లేకుండా చూసుకుంటాడు. ఆమెకు కావాల్సినంత స్వేచ్ఛ, డబ్బు ఇస్తుంటాడు.

ఈ ముగ్గురి కూతుళ్లు అంజని (ప్రత్యూష), కీర్తన (శ్రీలు), గీత (రెహానా) చిన్నప్పటి నుంచి స్నేహితులు. పై చదువుల కోసం పిఠాపురంలో కాలేజీలో చేరిన తర్వాత వారి జీవితాల్లో కొత్త పరిచయాలు వస్తాయి. అలా ముగ్గురూ ముగ్గురు యువకులతో ప్రేమలో పడతారు.

అయితే ఆ ప్రేమలు ముగ్గురి జీవితాల్లో ఒకే విధంగా ఉండవు. గీత తన ప్రేమను నమ్మి ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయి గోవాకి వెళ్లిపోతుంది. కీర్తన తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తుంది. మరోవైపు అంజని మాత్రం తన ప్రేమ గురించి తండ్రికి చెప్పాలా? వద్దా? అనే ఆలోచనలో పడుతుంది.

►ALSO READ | Missing Meghana Review: మిస్సింగ్ కేసు నుంచి మిస్టరీ థ్రిల్లర్‌గా.. ఉత్కంఠరేపే ఇన్వెస్టిగేషన్తో థియేటర్లలోకి కొత్త మూవీ

మరి ఈ ముగ్గురు తండ్రులు పిల్లలను పెంచిన విధానం.. వారి నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపింది? ప్రేమ విషయంలో తీసుకున్న నిర్ణయాల తర్వాత ఆ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తల్లిదండ్రులు, పిల్లలు ఎక్కడ తప్పు చేశారు? చివరకు వారి జీవితాలు ఎలా మారాయి? అనేది థియేటర్లలలో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఎలా ఉందంటే?

‘పిఠాపురంలో.. అలా మొదలైంది’లో దర్శకుడు ప్రధానంగా తండ్రి–కూతుళ్ల బంధాన్ని, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్రను చూపించే ప్రయత్నం చేశారు. కథలో ముగ్గురు తండ్రుల స్వభావాలను వేర్వేరుగా చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఒకరు స్నేహంగా పిల్లలను అర్థం చేసుకుంటే.. మరొకరు క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉంటారు. ఇంకొకరు డబ్బు, స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ మూడు విధానాల ప్రభావం పిల్లలపై ఎలా పడుతుందనేది కథలో కీలకంగా మారుతుంది.

ఫస్టాఫ్‌లో స్కూల్ డేస్, కాలేజ్ లైఫ్, లవ్, మ్యారేజ్ వంటి అంశాలతో కథ సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్‌లో ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడం, మరో అమ్మాయి ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతో కథలో అసలు సమస్యలు మొదలవుతాయి. సెకండాఫ్‌లో పెళ్లి తర్వాత కీర్తన ఎదుర్కొనే ఇబ్బందులు, గీతకు ఎదురయ్యే సమస్యలను ఎమోషనల్‌గా చూపించారు. అంతేకాకుండా ప్రేమ తర్వాత ఎదురయ్యే సమస్యలు, కుటుంబాల్లో వచ్చే మార్పులు, పిల్లలు–తల్లిదండ్రులు తమ నిర్ణయాలను మరోసారి ఆలోచించుకునే సీన్స్ సైతం ఆసక్తి పెంచుతాయి. ముఖ్యంగా సినిమా లాస్ట్ 40 నిమిషాలు తండ్రి–కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. పిల్లల్ని పెంచేటప్పుడు ప్రేమ, స్వేచ్ఛ, క్రమశిక్షణ మధ్య సమతుల్యత ఎంత అవసరమో.. తెలిసేలా చేసిన డైరెక్టర్ మహేష్ చంద్ర ప్రయత్నం మెచ్చుకోదగ్గది. 

నటీనటుల పెర్ఫార్మెన్స్

రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్ ముగ్గురు తండ్రుల పాత్రల్లో సహజంగా నటించారు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకున్నారు. ముగ్గురు హీరోయిన్లు ప్రత్యూష, శ్రీలు, రెహానా తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రేమ, కుటుంబానికి సంబంధించిన సన్నివేశాల్లో వీరి నటన బాగుంది. సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్‌తో పాటు మణిచందన, అన్నపూర్ణమ్మ, జయవాహిని తదితరులు తమ పరిధిలో మెప్పించారు.

టెక్నికల్‌గా..

మహేష్ చంద్ర కథను సింపుల్‌గా, కుటుంబ ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. పిఠాపురం, గ్రామీణ ప్రాంతాల లొకేషన్స్ కథకు చక్కగా సరిపోయాయి. పాటలు ఓకే అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఎడిటింగ్‌ సైతం మెప్పిస్తుంది. డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.