ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‎పై హైకోర్టు అనర్హత వేటు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‎పై హైకోర్టు అనర్హత వేటు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‎పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది.  2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్‎పై పోటీ చేసినప్పటి నుంచి దానం శాసన సభ సభ్యత్వం (2024, ఏప్రిల్ 23)పై అనర్హత వర్తిస్తుందని సంచలన తీర్పు వెలువరించింది.  దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ఈ మేరకు తెలంగాణ స్పీకర్, కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు తెలిపింది.

►ALSO READ | హైదరాబాద్ GHMC హెడ్డాఫీసు దగ్గర ఉద్రిక్తత... పోలీసులు, స్వచ్ఛ ఆటో కార్మికుల మధ్య తోపులాట

అసలేం ఏం జరిగిందంటే..?

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‎పై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‎లో చేరడంతోపాటు, సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేశాడని.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అతడిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్‎కు ఫిర్యాదు చేసింది. 

విచారణ అనంతరం బీఆర్ఎస్ ఫిర్యాదును స్పీకర్ కొట్టివేశారు. స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం 2026, ఆగస్టు 21న తీర్పును కోర్టు రిజర్వు చేసింది. తొలుత సెప్టెంబర్ 16న తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, తీర్పు సిద్ధం కాకపోవడంతో 18న ప్రకటించింది.

 పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం దానం నాగేందర్‎పై అనర్హత వేటు వేసింది.  దానంపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాడా.. లేక ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తందా అనేది స్టేట్ పొలిటికల్ సర్కిల్స్‎లో హాట్ టాపిక్ గా మారింది.