హైదరాబాద్: తెలంగాణపై ఎల్ నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని.. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వర్షాలు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం (సెప్టెంబర్ 18) సభలో ఎల్ నినోపై ప్రభుత్వం సల్పకాలిక చర్చ చేపట్టింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యవసాయ రంగానికి జీవనాధారమైన నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం ఉందని చెప్పారు.
ఎల్ నినో సమయంలో కరువు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని తెలిపారు. ఎల్ నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎల్ నినో గురించి తెలియగానే రైతులను హెచ్చరించామని.. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఏ పంటలు వేస్తే బాగుంటుందో రైతులకు తెలియజేశామన్నారు.
‘‘ఎల్ నినో వల్ల వర్షాలు పడక రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వ తగ్గింది. గతేడాది ఇదే సమాయనికి శ్రీశైలంలో 153 టీఎంసీలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం 61 టీఎంసీలే ఉన్నాయి. నాగార్జున సాగర్‌లో గతేడాది 174 టీఎంసీలు ఉంటే.. ఇప్పుడు 44 టీఎంసీలే ఉన్నాయి. శ్రీరామ్ సాగర్‌లో గతేడాదితో పోలిస్తే 34 టీఎంసీలు తక్కువగా ఉన్నాయి. గత ఏడాది ఈ సమయానికి కృష్ణా గోదావరి బేసిన్‌లో 500 టీఎంసీల నీరుంటే, ఇప్పుడు 240 టీఎంసీల నీరే ఉంది.. గత ఏడాదికన్నా సగానికి నీరు తగ్గిపోయింది’’ అని తెలిపారు.
తాగు నీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం:
ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా సాగు నీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తాగు నీటి అవసరాలు తీరాకే సాగు నీరు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నీరు తక్కువగా ఉన్న కొన్ని ప్రాజెక్టుల నుంచి విడుదల వాయిదా వేశామన్నారు. పంట కీలక దశలో ఉన్నప్పుడు నీరు అందకపోతే రైతులకు నష్టం జరుగుతుందని అన్నారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో స్థానిక ఆయకట్టు 48.55 లక్షల ఎకరాలు అని తెలిపారు.
►ALSO READ | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు
ఎల్ నిన్ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు పరశీలించాలని రైతులకు తెలియజేశామన్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పరిస్థితులను శివమ్ కమిటీ పరిశీలిస్తోంది. రైతులకు ముందుగానే వాస్తవాలు తెలియజేస్తున్నామని చెప్పారు. జలాశయాల్లో నీటి నిల్వను ప్రతి మంగళవారం రైతులకు తెలియజేస్తున్నామని తెలిపారు.
యాసంగి సాగుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు:
ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా యాసంగి సాగుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటిని పొదుపుగా వాడే సాగు పద్దతులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. నీటి ప్రవాహం పెరిగితే విడుదలకు ప్రణాళికను మారుస్తామని పేర్కొన్నారు. రైతులు పంటలు వేసే ముంద నీటి నిల్వల గురించి తెలుసుకోవాలని సూచించారు.
