BHEL సోలార్ ప్లాంట్‌లో 32 కేజీల వెండి మాయం.. రంగంలోకి దిగిన సీబీఐ

BHEL సోలార్ ప్లాంట్‌లో 32 కేజీల వెండి మాయం.. రంగంలోకి దిగిన సీబీఐ

భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL) గురుగ్రామ్‌లోని సిలికాన్ సోలార్ సెల్ ప్లాంట్‌లో వెండి మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ప్లాంట్‌లోని సుమారు 31కేజీల 650 గ్రాముల వెండి అదృశ్యం కావడంతో.. సీబీఐ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది.

ఈ అక్రమం వెనుక ప్లాంట్ హెడ్, అదనపు జనరల్ మేనేజర్ డాక్టర్ భరత్ కుమార్ పంత్, అప్పటి మెటీరియల్ మేనేజ్‌మెంట్ ఇన్‌చార్జ్ ఆశిష్ కుమార్‌ల పాత్ర ఉన్నట్లు సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. క్రమశిక్షణారాహిత్యం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాల మాయం, ప్రభుత్వోద్యోగుల నమ్మకద్రోహం వంటి సెక్షన్ల కింద సీబీఐ దీనిపై కేసులు నమోదు చేసింది.

2016-17 నాటికి కేంద్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ నిధులతో సుమారు 35 కేజీలకు పైగా వెండి అందుబాటులో ఉండేది. అయితే 2024 ఫిబ్రవరిలో చేసిన ఫిజికల్ వెరిఫికేషన్ లో కేవలం 6కేజీల 230 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 31కేజీల 650 గ్రాముల వెండికి సరైన లెక్కలు లేకపోవడంతో కుంభకోణం బయటపడింది.

2019లో ప్లాంట్ బాధ్యతలు భరత్ కుమార్ పంత్ తీసుకున్న తర్వాతే అసలు సమస్య ప్రారంభమైంది. ఆ తర్వాత వార్షిక తనిఖీలు పూర్తిగా నిలిచిపోయాయి. స్టాక్ రిజిస్టర్లు, ఇన్వెంటరీ రిపోర్టులు మాయం కాగా.. వెండి వాడకం, కదలికలపై ఎలాంటి రికార్డులు లేవని సీబీఐ విచారణలో తేలింది.

ఈ కుంభకోణంలో మరికొంత మంది అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ సమయంలో అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పటంతో సీబీఐ మోసం గురించి పూర్తి సమాచారం లాగుతోంది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఈ వెండి విలువ దాదాపు 71 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.