అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి చెన్నైలో కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల విలువైన భూమి వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR) ప్రాంతంలో ఉన్న సుమారు 2.7 ఎకరాల వివాదాస్పద ఆస్తికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు నోటీసులు జారీ చేసింది.
ఈ ఆస్తి వివాదం ఏంటి ?
1988లో శ్రీదేవి కుటుంబం ఎమ్.సి. చంద్రశేఖరన్ కుటుంబం నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. అయితే, ఎమ్.సి. శివకామి, ఎమ్.సి. నటరాజన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ సేల్ డీడ్‌ను సవాల్ చేస్తూ కోర్టుకెక్కారు. అది తమ పిత్రార్జిత ఆస్తి అని, చంద్రశేఖరన్ మొదటి భార్య సంతానమైన తమ హక్కులను పక్కనబెట్టి అక్రమంగా అమ్మేశారని వారు ఆరోపిస్తున్నారు.
మద్రాస్ హైకోర్టు తీర్పు..
అయితే అంతకుముందు ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.వి. తమిళ్ సెల్వి, పిటిషనర్ల వాదనను కొట్టిపారేశారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత (1988 నాటి సేల్ డీడ్‌పై 2023లో) కోర్టుకు రావడం కాలపరిమితిని దాటిపోవడమే అని తెలిపింది. పిటిషనర్లు క్లాస్-1 వారసులు కారని, వాస్తవాలను దాచిపెట్టి ఈ కేసు దాఖలు చేశారని తప్పుపట్టింది. ఈ వ్యాజ్యాన్ని ఒక అనవసర వేధింపు ప్రక్రియగా అభివర్ణిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.
సుప్రీంకోర్టు ఎంట్రీ..
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పిళ్లైలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, మూడో వ్యక్తికి బదిలీ చేయకూడదని, స్వాధీనంలో ఎలాంటి మార్పులు చేయకూడదని అటు కపూర్ కుటుంబానికి, ఇటు పిటిషనర్లకు తేల్చిచెబుతూ 'స్టేటస్ కో' ఆదేశాలు జారీ చేసింది.
అంతే కాకుండా, డిసెంబర్ 18న జరిగే తదుపరి విచారణలోగా ఇరువర్గాలు మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశాన్ని కూడా పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. కోట్ల విలువైన ఈ స్థిరాస్తి వివాదం లీగల్‌గా ముగుస్తుందో లేక మధ్యవర్తిత్వంతో సమసిపోతుందో వేచి చూడాలి..
