గాంధీని కదిలించిన ఆ స్వరం.. ఎంఎస్ సుబ్బులక్ష్మి స్మృతిలో నిర్మలా సీతారామన్ భావోద్వేగం!

గాంధీని కదిలించిన ఆ స్వరం.. ఎంఎస్ సుబ్బులక్ష్మి స్మృతిలో నిర్మలా సీతారామన్ భావోద్వేగం!

కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, దివంగత 'భారతరత్న' ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతి వేడుకలు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ..  సుబ్బులక్ష్మి  అంకితభావాన్ని, దాతృత్వాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మహాత్మా గాంధీకి ఎంతో ప్రియమైన మీరాబాయి భజన్ 'హరి తుమ్ హరో' పాడటం కోసం ఎం.ఎస్. రాత్రంతా నిద్రపోకుండా, ఉచ్చారణ లోపం లేకుండా సాధన చేసి రికార్డ్ చేశారట. ఈ భజన్ విన్న గాంధీజీ.. మరెవరైనా ఈ పాటను పాడటం కంటే, సుబ్బులక్ష్మి నోటి వెంట మాటలుగా వినడానికైనా నేను ఇష్టపడతాను అని కొనియాడారని నిర్మల గుర్తుచేశారు. ఎంఎస్ సుబ్బులక్ష్మిని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

 

1916 సెప్టెంబర్ 16న మధురైలో జన్మించిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, సంగీత ప్రయాణంలో సృష్టించిన చరిత్ర అసమానం. కుల, మత, ప్రాంత, భాషా సరిహద్దులను చెరిపేస్తూ ఆమె స్వరం విశ్వవ్యాప్తమైంది. 1966లో ఐక్యరాజ్యసమితి (UN General Assembly) జనరల్ అసెంబ్లీలో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయ సంగీత విద్వాంసురాలు ఆమే కావడం విశేషం...

ఆమెను కేవలం గాయనిగానే కాకుండా, కలియుగ వెంకటేశ్వర స్వామిని నిద్రలేపే 'సుప్రభాతం' రూపంలో ప్రతి హిందూ గడపలోనూ నిత్యం వినే దైవిక స్వరంగా కొలుస్తారు. 1974లో 'రామోన్ మెగసెసే' అవార్డు అందుకున్న తొలి భారతీయ సంగీత కళాకారిణిగా.. 1998లో దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'పొందిన తొలి సంగీత విద్వాంసురాలిగా ఎం.ఎస్. చరిత్రకెక్కారు.

సంగీతం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సొంతానికి దాచుకోకుండా, అనేక ధార్మిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలకు, పురాతన దేవాలయాల పునరుద్ధరణకు గుప్తదానంగా ఇచ్చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. 2004 డిసెంబర్ 11న, 88 ఏళ్ల వయసులో చెన్నైలో ఆమె స్వర ప్రయాణం ముగిసినా, ఆ దివ్య గానం అమరమై నిలిచిపోయింది.

మరో వైపు  ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ షూటింగ్ అఫిషియల్గా మొదలైంది. ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షాట్కు కమల్ హాసన్ క్లాప్ కొట్టారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ సినిమా లాంచ్ ఈవెంట్ను చెన్నైలో నిర్వహించారు. ఈ బయోపిక్కు 'ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి అమ్మ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అల్లు అరవింద్, బన్నీ వాసు, రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.