పెట్రోల్ బంకుల్లో చెల్లింపులపై UPI ఛార్జీలు రద్దు చేయండి: కేంద్ర ఆర్థిక మంత్రికి డీలర్ల విజ్ఞప్తి

పెట్రోల్ బంకుల్లో చెల్లింపులపై UPI ఛార్జీలు రద్దు చేయండి: కేంద్ర ఆర్థిక మంత్రికి డీలర్ల విజ్ఞప్తి

UPI లావాదేవీలపై కొత్తగా తీసుకొచ్చిన ఛార్జీల నుంచి పెట్రోల్ బంకులకు పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కోరింది. డీలర్స్ సంఘం అధ్యక్షుడు అజయ్ బన్సాల్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అధికారికంగా ఒక లేఖ రాశారు. రూ.2వేల కంటే ఎక్కువ విలువైన డిజిటల్ చెల్లింపులపై విధించే ఈ ఛార్జీలు పెట్రోల్ బంకుల వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని, డీలర్లకు వచ్చే తక్కువ లాభాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  

పెట్రోలియం రంగంలో డీలర్ల మార్జిన్లు శాతాల వారీగా ఉండవని, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఇవి లీటరుకు ఇంత అని ఫిక్స్‌డ్‌గా నిర్ణయించబడతాయని అసోసియేషన్ స్పష్టం చేసింది. లావాదేవీల విలువ పెరిగినప్పటికీ డీలర్లకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉండదని, కానీ ఈ ప్రాసెసింగ్ ఛార్జీల రూపంలో భారీగా కోత పడుతుందని అన్నారు. అంతేకాకుండా విద్యుత్ ఛార్జీలు, ఉద్యోగుల జీతాలు, ఇతర నిర్వహణ వ్యయం పెరుగుతున్నప్పటికీ 2017 అక్టోబర్ నుంచి తమ కమిషన్లలో ఎలాంటి పెంపు లేదని గుర్తుచేశారు.

ఒకవేళ రూ.2వేలు దాటిన లావాదేవీలపై ఫ్లాట్‌గా రూ.5 వసూలు చేసినా లేదా 0.4 శాతం మేర MDR అమలు చేసినా.. పెట్రోల్ బంకుల్లో జరిగే వేలకొద్దీ లావాదేవీల కారణంగా ఇది చాలా పెద్ద ఆర్థిక భారంగా మారుతుందని అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో క్రెడిట్, డెబిట్ కార్డ్ చెల్లింపుల విషయంలో ఇంధన రంగం ప్రత్యేకతను గుర్తించి ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయని, అదే పద్ధతిని ఇప్పుడు యూపీఐ చెల్లింపులకు కూడా వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు.  

►ALSO READ | మళ్లీ సిగరెట్ల రేట్లు పెంచిన ITC.. ఏ బ్రాండ్‌పై రేట్లు ఎంత పెరిగాయంటే?

ఈ ఛార్జీల భారాన్ని తగ్గించకపోతే తమకు వస్తున్న తక్కువ లాభాలను కాపాడుకోవడానికి డీలర్లు డిజిటల్ పేమెంట్లను తగ్గించాల్సిన లేదా ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని లేఖలో పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యానికి విరుద్ధమని తెలిపారు. కాబట్టి పెట్రోల్ బంకుల్లో జరిగే అన్ని రకాల యూపీఐ లావాదేవీలపై పూర్తి మినహాయింపు ఇచ్చి తమను ఆదుకోవాలని కోరారు.