మళ్లీ సిగరెట్ల రేట్లు పెంచిన ITC.. ఏ బ్రాండ్‌పై రేట్లు ఎంత పెరిగాయంటే?

మళ్లీ సిగరెట్ల రేట్లు పెంచిన ITC.. ఏ బ్రాండ్‌పై రేట్లు ఎంత పెరిగాయంటే?

దేశీయ FMCG, టొబాకో దిగ్గజ కంపెనీ ITC లిమిటెడ్ సిగరెట్ ప్రియులకు మరోసారి షాకిచ్చింది. పొగాకు ఉత్పత్తులపై పన్ను విధానంలో వచ్చిన మార్పులు, అదనపు ఎక్సైజ్ డ్యూటీ భారాన్ని తట్టుకునేందుకు మరోసారి తన సిగరెట్ బ్రాండ్ల రేట్లను భారీగా పెంచేసింది. ఇప్పటికే పెరిగిన ధరలతో కూడిన కొత్త స్టాక్ మార్కెట్లోకి విడుదల కావడం ప్రారంభమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పెంపుతో వినియోగదారుల జేబులకు మరింత చిల్లు పడనుంది.

ఐటీసీ సిగరెట్ల ధరల పెంపు వివరాలు..

క్లాసిక్ కనెక్ట్: అత్యంత ప్రజాదరణ పొందిన 'క్లాసిక్ కనెక్ట్' 20 సిగరెట్ల ప్యాక్ ధరను ఐటీసీ భారీగా పెంచింది. గతంలో ఈ ప్యాక్ ధర రూ. 390 ఉండగా.. తాజా పెంపుతో దీని రేటు రూ.428కి చేరింది. అంటే ఒక్కో ప్యాక్‌పై ఏకంగా రూ.38 పెంచేశారు.

గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్: యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న 'గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్' 10 సిగరెట్ల చిన్న ప్యాక్ ధరను కూడా కంపెనీ పెంచింది. గతంలో రూ.79గా ఉన్న ఈ ప్యాక్ ధర ఇప్పుడు రూ.89కి చేరింది. దీనిపై ఒక్కసారిగా రూ.10 అంటే దాదాపు 12.66 శాతం ధర పెరగడం గమనార్హం.

ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ రేటును 40 శాతానికి పెంచడంతో పాటు కొత్తగా అదనపు ఎక్సైజ్ డ్యూటీని మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ ట్యాక్స్ పోటును కవర్ చేసుకునేందుకు ఐటీసీతో పాటు ఇతర పొగాకు కంపెనీలు ఏడాది కాలంగా విడతలవారీగా ధరలను పెంచుకుంటూ వస్తున్నాయి. ఫిబ్రవరిలో రూ.300 ఉన్న క్లాసిక్ కనెక్ట్ ప్యాక్ ధరను మొదట రూ.360కి, ఆ తర్వాత రూ.390కి పెంచగా.. ఇప్పుడు ఏకంగా రూ.428కి చేరింది. అలాగే గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ ధర గతంలో రూ.59 ఉండగా, మే నెలలో రూ.79కి, తాజాగా ఇప్పుడు రూ.89కి పెరిగింది.

ALSO READ : UPI ఛార్జీలపై డిజిటల్ పేమెంట్ ఫ్లాట్ ఫాంల స్పందన..

అమ్మకాలపై ప్రభావం..
పదేపదే సిగరెట్ల ధరలను పెంచుకుంటూ పోవడం వల్ల కంపెనీ ట్యాక్స్ భారాన్ని తగ్గించుకోగలిగినప్పటికీ.. ఇది వినియోగదారుల డిమాండ్, మొత్తం సేల్స్ వాల్యూమ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ నోమురా హెచ్చరించింది. అయినప్పటికీ మార్కెట్లో తమ ప్రాఫిటబిలిటీని కాపాడుకునేందుకు ఐటీసీ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. పాత స్టాక్ పూర్తిగా అయిపోవడంతో.. రిటైల్ దుకాణాల్లో వినియోగదారులకు కొత్త MRP ధరలతోనే సిగరెట్ ప్యాక్‌లు దొరుకుతున్నాయి. ఒకపక్క పొగాకు రైతులు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతుంటే కంపెనీలు మాత్రం రేట్లను పెంచుతూ తమ లాభాలను కాపాడుకుంటున్నాయి.