ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్: PF వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు

ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్: PF వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు

దేశంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల తప్పనిసరి వేతన పరిమితిని కేంద్ర కేబినెట్ భారీగా పెంచింది. ఇప్పటివరకు ఉన్న రూ.15వేల పరిమితిని ఏకంగా రూ.25వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ సరికొత్త నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 51 లక్షల మంది అదనపు ఉద్యోగులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది.

ఎందుకు పెంచాల్సి వచ్చింది?
గతంలో 2014 సెప్టెంబర్‌లో ఈ వేతన పరిమితిని రూ.15వేలుగా నిర్ణయించారు. అయితే ఆ తర్వాత కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అన్-స్కిల్డ్ కనీస వేతనాలు కూడా రూ.15వేలు దాటిపోయాయి. పెరిగిన జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, జీతాల వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ పాత క్యాప్‌ను మార్చాలని ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న మోడీ ప్రభుత్వం.. తాజాగా ఉద్యోగులకు సోషల్ సెక్యూలిటీ బెనిఫిట్స్ కల్పించే లక్ష్యంతో వేతన పెంపునకు ఆమోద ముద్ర వేసింది. 

ఉద్యోగులకు అందే ప్రయోజనాలు ఏమిటి?
ప్రస్తుతం రూ.15వేల నుంచి రూ.25వేల మధ్య జీతం అందుకుంటున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో.. వారు ఇకపై ఆటోమేటిక్‌గా పీఎఫ్ పరిధిలోకి వస్తారు. దీనివల్ల ఉద్యోగులకు పీఎఫ్ పొదుపులే కాకుండా, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కూడా అందుతాయి. దీనికోసం ప్రభుత్వంపై ఏటా రూ.11వేల 339 కోట్ల అదనపు భారం పడనుండగా, ఐదేళ్లలో ఇది సుమారు రూ.56వేల 696 కోట్లకు చేరనుంది.

►ALSO READ | పెట్రోల్ బంకుల్లో చెల్లింపులపై UPI ఛార్జీలు రద్దు చేయండి: కేంద్ర ఆర్థిక మంత్రికి డీలర్ల విజ్ఞప్తి

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
మోడీ కేబినెట్ తీసుకున్న పీఎఫ్ వేతన పెంపు నిర్ణయం తక్షణ ప్రభావంతో రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. కొత్తగా ఉద్యోగాల్లోకి చేరే యువతకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఫార్మల్ ఎంప్లాయ్‌మెంట్‌ను ప్రోత్సహించడంతో పాటు.. 'విక్షిత్ భారత్ @2047' లక్ష్యానికి అనుగుణంగా ఉద్యోగులకు దీర్ఘకాలిక రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.