హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ భూ దందాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలను బయటపెట్టారు. ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు వేల ఎకరాల భూములను దోచుకున్నారని సీఎం చెప్పారు. ఉద్యమాలు చేసినవాళ్లు సర్వం కోల్పోయారని, ఉద్యమకారుడి ఏ చరిత్ర చూసినా ఇదే ఉంటుందని సీఎం వివరించారు.
కానీ.. తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకునే కేసీఆర్ మాత్రం వేల కోట్లు సంపాదించాడని సీఎం ఎద్దేవా చేశారు. 1950 నుంచి వివాదంలో ఉన్న భూమి.. 2017లో కేసీఆర్ వశమైందని సీఎం వివరించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశించారు. సత్యం రామలింగరాజు కంపెనీ భూములే కేటీఆర్కు బదిలీ అయ్యాయని సీఎం వెల్లడించారు.
హరీష్ రావు.. ఫాం హౌస్ రంగనాయక సాగర్ దగ్గర ఉందని.. హరీష్ రావు తన ఫాం హౌస్కు స్పెషల్గా రోడ్డు వేయించుకున్నాడని చెప్పారు. 10 ఎకరాల ఇరిగేషన్ భూమిని సుడాకు హరీశ్ బదిలీ చేయించాడని సీఎం రేవంత్ చెప్పారు. 9 జిల్లాలు, 24 మండలాలు, 31 గ్రామాల్లో కేసీఆర్ ఫ్యామిలీకి 440 ఎకరాల భూమి ఉందని సీఎం ప్రకటించారు. సిద్దిపేట మున్సిపాలిటీ నిధులతో హరీశ్ రావు ఫాంహౌస్కు రోడ్లు వేయించుకున్నాడని ఆరోపించారు.
►ALSO READ | కేసీఆర్ అండ్ ఫ్యామిలీ భూముల వివరాలు ఇవే..
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫ్యామిలీకి షాబాద్లో 47 ఎకరాలు ఉన్నాయని సీఎం చెప్పారు. ఇందులో 11.5 ఎకరాల ఇనాం భూములు తీసుకున్నారని.. ఇనాం భూములు జగదీశ్వర్ రెడ్డికి ఎలా పట్టా అయిందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ అసైన్డ్ భూముల్లో ఉందని సీఎం వెల్లడించారు. కిషన్ రెడ్డి సొంతూరు తిమ్మాపూర్లో కబ్జాలు చేశారని.. తిమ్మాపూర్లో 77 ఎకరాల భూదాన్ భూమి ఉందని సీఎం చెప్పారు. 77 ఎకరాల భూదాన్ భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరు పైకి వెళ్లిందని, అసలు భూదాన్ భూములు ఎలా పట్టా చేశారని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.
77 భూదాన్ భూములపై మాట్లాడితే సబిత తనను విమర్శిస్తోందని.. బహదూర్ పుర, తిమ్మాపూర్ భూములపై విచారణ జరగాలని సీఎం అభిప్రాయపడ్డారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎవరికి బంధువని సీఎం ప్రశ్నించారు. నమస్తే తెలంగాణ ఎండీకి విలువైన కార్లు ఎలా వచ్చాయని విస్మయం వ్యక్తం చేశారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ నుంచి గిఫ్ట్లు తీసుకుంది మీరు కాదా అని బీఆర్ఎస్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
బోయిన పల్లి వినోద్, బోయినపల్లి శ్రీనివాస రావు కేసీఆర్ బినామీలు అని సీఎం రేవంత్ ఆరోపించారు. వట్టినాగులపల్లిలో శ్రీనివాసరావు కబ్జాలను బయటపెడతానని సీఎం స్పష్టం చేశారు. భూపాలపల్లిలో 106 ఎకరాల ఫారెస్ట్ భూములు తొలగించి రిజిస్ట్రేషన్ చేశారని సీఎం వివరించారు. గండ్ర వెంకటరమణా పేరుతో 106 ఎకరాల ఫారెస్ట్ భూమి రిజిస్ట్రేషన్ అయి ఉందని చెప్పారు.
నెలిమలి గ్రామంలో 13 వందల ఎకరాల భూమి బీఆర్ఎస్ వ్యక్తి పట్టా చేసుకున్నాడని సీఎం బయటపెట్టారు. సిరిసిల్లలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు మారాయని, 8 వేల ఎకరాలు బీఆర్ఎస్ నేతల పేరుపైకి మార్చుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. హరీష్ రావు పేరు మీద 27 ఎకరాలు, ఆయన భార్య పేరు మీద 8 ఎకరాల భూమి ఉందని సీఎం చెప్పారు. కవిత ఫ్యామిలీకి 37 ఎకరాల భూమి ఉందని తెలిపారు. జోగినపల్లి సంతోష్ పేరుతో 53 ఎకరాలు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సర్వే నంబర్లతో సహా వివరాలను బయటపెట్టారు.
