- రాష్ట్రంపై భారీ వర్షాల ప్రభావం అంతంతే
- కరువు జిల్లాల్లో 40 శాతానికి పైగా లోటు వర్షం
- జోగులాంబ గద్వాల జిల్లాలో పరిస్థితి దుర్భరం
- వనపర్తిలో 41%.. నాగర్ కర్నూల్లో 39 శాతం
- ఒకే సారి వర్షం పడితే లాభం లేదన్న ఐఎండీ
- రాష్ట్రంలో భారీ వర్షాల ప్రభావం అంతంతే!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షపాత లోటు తగ్గడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడినా.. వర్షాభావ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 18 జిల్లాల్లో లోటు వర్షపాతమే కొనసాగుతోంది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల, హనుమకొండ, వనపర్తి, నాగర్‌కర్నూల్, వరంగల్ వంటి జిల్లాల్లో వర్షపాత లోటు ఏకంగా 40 శాతానికిపైగానే ఉంది. ఒకేసారి కురిసే కుంభవృష్టి వల్ల వరద నీరంతా వృథాగా కొట్టుకుపోవడమే తప్ప, భూగర్భ జలాల రీచార్జ్‌కు గానీ, పంటల ఎదుగుదలకు గానీ ప్రయోజనం ఉండదని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడ్డాయి. ఈ సీజన్లోనే అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షం పడింది. చాలాచోట్ల కూడా 12 సెంటీమీటర్లకుపైగానే వర్షపాతం నమోదైంది. అయినా కూడా ఆ జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడలేదు. భారీ వర్షం పడిన తర్వాత కూడా హనుమకొండలో ఇంకా -42 శాతం లోటు వర్షపాతమే ఉంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 726.9 మిల్లీమీటర్లు కాగా.. కురిసింది కేవలం 421.9 మిల్లీమీటర్లే. వరంగల్‌లో ఇంకా -37 శాతం లోటు కొనసాగుతోంది. సాధారణం 770.8 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటివరకు పడింది 483.9 మిల్లీమీటర్లే. ఒక్కరోజు భారీ వర్షం పడినంత మాత్రాన నెలల తరబడి నెలకొన్న లోటు పూడదని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
దక్షిణ తెలంగాణ విలవిల
ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గడిచిన 24 గంటల్లో ఈ జిల్లాల్లో చుక్క వర్షం పడలేదు. సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు సరైన వానల్లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. సాధారణ వర్షపాతం 389 మిల్లీమీటర్లు కాగా.. కురిసింది కేవలం 212.7 మిల్లీమీటర్లు మాత్రమే. .వనపర్తిలో 41 శాతం, నాగర్‌కర్నూల్‌లో -39 శాతం లోటు నమోదైంది. నారాయణపేట, ఖమ్మం జిల్లాల్లో -37 శాతం లోటు నెలకొంది. సూర్యాపేట (-34%), నల్గొండ (-33%), మహబూబ్‌నగర్ (-31%) జిల్లాల్లోనూ కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. సీజన్ మొదలై 107 రోజులు దాటినా.. కరువు జిల్లాల్లో వర్షపు రోజుల సంఖ్య దారుణంగా పడిపోయింది. జోగులాంబ గద్వాలలో సీజన్ మొత్తంలో వర్షం పడిన రోజులు కేవలం 18 మాత్రమే.
అతిభారీ వర్షాలతో లాభం ఉండదు
రాష్ట్రవ్యాప్త సగటు వర్షపాతం సాధారణం కంటే 19 శాతం లోటు ఉంది. సాధారణ వర్షపాతం 659.8 మిల్లీమీటర్లతో పోలిస్తే.. రాష్ట్రంలో ప్రస్తుతం 535.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మామూలుగా అయితే వర్షపాత లోటు 20 శాతం కన్నా తక్కువుంటే వాతావరణ శాఖ దానిని నార్మల్‌గానే పరిగణిస్తుంటుంది. ప్రస్తుతం రాష్ట్రసగటు లోటు 19 శాతం ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 18 జిల్లాలు డేంజర్ జోన్లోనే ఉన్నాయి. కేవలం 15 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.
అందులోనూ మెదక్ (+10%), కామారెడ్డి (+8%), సిద్దిపేట (+5%), సిరిసిల్ల (+4%), మంచిర్యాల (+2%) మినహా మిగిలిన జిల్లాలన్నీ మైనస్ పరిధిలోనే కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో వర్షాలు రోజూ లేదా రెండు మూడు రోజులకోసారి క్రమపద్ధతిలో మోస్తరు లేదా భారీ వర్షాలు పడితేనే నేలకు, పంటలకు ప్రయోజనం చేకూరుతుంది. కానీ ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల రోజుల తరబడి వర్షాభావం ఉండి, ఒక్కరోజే భారీ నుంచి అతిభారీ వర్షాలతో కుంభవృష్టి కురుస్తున్నది. దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా కుండపోత పడితే ఉపరితల ప్రవాహం పెరిగి నీరంతా వరద రూపంలో వాగులు, వంకల గుండా నదుల్లోకి, సముద్రంలోకి కొట్టుకుపోతుంది తప్ప భూమిలోకి ఇంకే సమయం ఉండదంటున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు రీచార్జ్ కావని చెబుతున్నారు. ఆకస్మిక వరదలతో పొలాల్లో నీళ్లు నిలిచి పైర్లు కుళ్లిపోవడం, భూమి పైపొరల్లోని సారవంతమైన మట్టి కొట్టుకుపోవడం జరుగుతుందంటున్నారు.
