హైదరాబాద్: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరానికి నలువైపులా ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోందన్నారు.
గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి హైదరాబాద్‌లోకి వచ్చే దూరప్రాంత, అంతర్‌జిల్లా, అంతర్రాష్ట్ర బస్సులను నగరంలోని అంతర్గత ప్రాంతాల్లోకి అనుమతించకుండా ఆయా దిశల్లో ఏర్పాటు చేసే టెర్మినల్స్ వరకు మాత్రమే నడిపించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
టెర్మినల్స్ నుంచే సిటీ కనెక్టివిటీ
టెర్మినల్స్‌కు చేరుకున్న ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా సిటీ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను సమన్వయం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవసరాన్ని బట్టి విమానాశ్రయం వైపు వెళ్లే బస్సులు, హైదరాబాద్‌కు వచ్చే అంతర్‌జిల్లా బస్సులను కూడా నిర్దేశిత టెర్మినల్స్ వద్దే నిలిపి, అక్కడి నుంచి ప్రయాణికులను నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించేలా లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నట్లు చెప్పారు.
ప్రైవేట్ బస్సులకూ టెర్మినల్ విధానం
హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం, రాత్రి సమయాల్లో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్యం పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రైవేట్ బస్సులను కూడా నిర్దేశిత బస్ టెర్మినల్స్ నుంచే నిర్వహించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
అవసరమైన నిబంధనల మేరకు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రైవేట్ బస్సులు టెర్మినల్స్‌ను వినియోగించుకునే విధానంపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి దూరప్రాంత బస్సుల ప్రవేశం తగ్గి ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
భూమి కేటాయింపుపై సానుకూలంగా ప్రభుత్వం
బస్ టెర్మినల్స్ ఏర్పాటుకు అవసరమైన భూమి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాజులరామారం ప్రాంతంలో సుమారు 100 ఎకరాలు, శంషాబాద్ వైపు సుమారు 150 ఎకరాల భూమిని బస్ టెర్మినల్ అవసరాలకు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
►ALSO READ | నానక్‌రామ్‌గూడ భూ వివాదం.. అల్లు అర్జున్ మామపై పోలీసులకు ఫిర్యాదు
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టెర్మినల్స్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు వెయిటింగ్ ఏరియాలు, పార్కింగ్, మెరుగైన కనెక్టివిటీ వంటి సౌకర్యాలను కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.
2,200 ఎలక్ట్రిక్ బస్సులతో ప్రజా రవాణాకు మరింత బలం
హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రానున్న 2,200 ఎలక్ట్రిక్ బస్సులను సమర్థవంతంగా వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు మెరుగైన సిటీ బస్ కనెక్టివిటీ కల్పించడంతో పాటు, బస్ టెర్మినల్స్ నుంచి నగరంలోని ప్రతి ప్రాంతానికి ప్రయాణికులు సులభంగా చేరుకునేలా రూట్లను రూపొందించనున్నట్లు చెప్పారు.
టెర్మినల్ ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థతో నగరంలోకి వచ్చే బస్సుల సంఖ్యను నియంత్రించడంతో పాటు ప్రయాణికులకు సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ వంటి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అందుబాటులోకి తీసుకురావచ్చని మంత్రి పేర్కొన్నారు.
ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు కీలక అడుగు
హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజా రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. నగర శివార్లలోని టెర్మినల్స్ వద్దే దూరప్రాంత, అంతర్‌జిల్లా, అంతర్రాష్ట్ర బస్సులను నిలిపి, అక్కడి నుంచి సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం వల్ల నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యం తగ్గే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌ను మరింత సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
