సీఎం రేవంత్‌తో ఎలాంటి గ్యాప్ లేదు.. మంచి వేవ్‌లెంగ్త్ ఉంది: మహేశ్ కుమార్ గౌడ్

 సీఎం రేవంత్‌తో ఎలాంటి గ్యాప్ లేదు.. మంచి వేవ్‌లెంగ్త్ ఉంది: మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గ్యాప్ లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు మంచి వేవ్‌లెంగ్త్ కుదిరిందని తెలిపారు. పార్టీ వ్యవహారాల్లో తామంతా సమన్వయంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

మాజీ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమేనని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే పార్టీలో ఎవరైనా నిర్దేశించిన గీత దాటితే చర్యలు తీసుకునే ప్రక్రియ కొండా సురేఖ వ్యవహారంతోనే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లుగా సమర్థవంతంగా పనిచేశానని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ కమిటీలు (డీసీసీలు) కీలకంగా, పవర్‌ఫుల్‌గా ఉంటాయని స్పష్టం చేశారు. డీసీసీల విషయంలో ఇదే తుది నిర్ణయమని పేర్కొన్నారు.

ప్రస్తుతం డీసీసీలను పట్టించుకోని వారు భవిష్యత్తులో వారి వద్దకే వెళ్లాల్సి వస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో డీసీసీల పాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

22O అంశంపై స్పందిస్తూ.. అది కాంగ్రెస్‌కు సంబంధించిన విషయం కాదని, బీఆర్ఎస్‌కు సంబంధించినదని అన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి రేపు అసెంబ్లీలో స్పందిస్తారని తెలిపారు.

ALSO READ : మహిళా సంక్షేమమే సీఎం రేవంత్ లక్ష్యం: మంత్రి సీతక్క

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం స్పష్టంగా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.