ముగింపు దశకు వానాకాలం.. రుతుపవనాల తిరోగమనంపై IMD కీలక ప్రకటన

ముగింపు దశకు వానాకాలం.. రుతుపవనాల తిరోగమనంపై IMD కీలక ప్రకటన

న్యూఢిల్లీ: దేశ వ్యవసాయ రంగానికి జీవనధారమైన నైరుతి రుతుపవనాల తిరోగమనంపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19 నాటికి పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. 

సాధారణంగా కేరళ గుండా రాష్ట్రంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు రాజస్థాన్ నుంచి ఉపసంహరించుకుంటాయి. నైరుతి రుతుపవనాల తిరోగమన నేపథ్యంలో పశ్చిమ రాజస్థాన్‎లో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 

సెప్టెంబర్ 19 నుంచి వాతావరణం పొడిగా మారుతుందని తెలిపింది. అయితే, రాజస్థాన్‌లో రుతుపవనాల ఉపసంహరణ మొదలైనప్పటికీ మధ్య, తూర్పు, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలోసెప్టెంబర్ 19-21 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. 

►ALSO READ | బీజేపీలోకి 17 మంది NCPI ఎంపీలు.. బిగ్ బాంబ్ పేల్చిన TMC రెబల్ ఎంపీ

నైరుతి రుతుపవనాల తిరోగమనంతో వర్షం కాలం ముగియనుంది. కాగా, ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఆలస్యంగా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఎల్ నినో వల్ల దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు తక్కువగా కురిశాయి.