ఊటీలో ఇద్దరు తమిళ మిత్రులు, మరో ఇద్దరు తెలుగు మిత్రులం కలుసుకున్నారు. ఆ సందర్భంలో తమిళ మిత్రులు తమ మాతృభాషలో మాట్లాడుకుంటున్నప్పుడు, తెలుగు వారికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. కానీ, అదే తెలుగు వాళ్లు మాట్లాడుకుంటుంటే మాత్రం వారికి దాదాపుగా అంతా అర్థమైపోతోంది!
దీనికి కారణం మనకేదో రహస్యాలు తెలియకపోవడం కాదు. మన తెలుగు సంభాషణల్లో విరివిగా వాడుతున్న ఆంగ్ల పదాల ఆధిపత్యమే. తమిళ మిత్రుల సంభాషణలో ఆంగ్ల పదాలు అరుదుగా వినిపిస్తే, మన తెలుగు భాషలో మాత్రం ఆంగ్ల పదాలదే పైచేయిగా మారింది. ఒక రచయితగా నాకూ ఈ సమావేశంలో స్వయంగా అనుభవంలోకి వచ్చేంత వరకు ఈ విషయం తట్టలేదు. అక్కడున్న తెలుగువాళ్లలో నేనొకరిని.
ఆంగ్ల పదాలను వాడాలన్న దురుద్దేశం ఏ తెలుగు వారికీ ఉండదు. అది ఒక అలవాటుగా, అసంకల్పితంగా జరిగిపోతోంది. ఇతర భాషల వారితో పోలిస్తే, తెలుగు వారిలోనే ఈ ధోరణి తీవ్రంగా కనిపిస్తోంది. దీనివల్ల మన రహస్యాలు ఇతరులకు తెలిసిపోతున్నాయన్నది ఇక్కడ ప్రధాన సమస్య కాదు, మన మాతృభాష స్వచ్ఛత పూర్తిగా కల్తీ అయిపోతోందన్నదే ఆవేదన.
ఉదాహరణకు, దైనందిన జీవితంలో మనం మాట్లాడే మాటలనే గమనిద్దాం. ‘‘పొద్దున్నే లేచి బ్రష్ చేసి, బ్రేక్‌ఫాస్ట్ తిని ఆఫీస్‌కి వెళ్లాను’’ అని చాలా సాధారణంగా అనేస్తుంటాం. దీన్నే ‘‘ఉదయాన్నే నిద్రలేచి పళ్లు తోముకుని, అల్పాహారం తీసుకుని ఆఫీస్‌కి (‘కార్యాలయానికి’ కాకపోయినా) వెళ్లాను’’ అని చెప్పడం ఏమంత కష్టం కాదు కదా!
అలాగే, ‘‘ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ నాకు మీ హెల్ప్ కావాలి’’ అనడానికి బదులు ‘‘ఈ సమస్యను పరిష్కరించడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ నాకు మీ సహాయం కావాలి’’ అంటే ఆ వాక్యంలో ఎంత హాయి ఉందో గమనించవచ్చు.
‘‘బస్ జర్నీ వల్ల టైర్డ్ గా ఉంది, రెస్ట్ తీసుకుంటాను’’ అనడం కన్నా ‘‘బస్సు ప్రయాణం వల్ల అలసటగా ఉంది, విశ్రాంతి తీసుకుంటాను’’ అనడం భావాన్ని పండిస్తుంది.
వాటర్, టైమ్, యూజ్, రీజన్, డిసైడ్, ఫీల్ వంటి ఎన్నో ఆంగ్ల పదాలు ఏ అవసరం లేకుండానే మన వాక్యాల్లో చొరబడిపోయాయి. ఇలాగే ఈ పరిస్థితి కొనసాగితే, రాబోయే కొన్నేళ్లకు మన దైనందిన సంభాషణల్లో అసలైన తెలుగు పదాలు 25 శాతం కన్నా దిగువకు పడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు క్రమక్రమంగా మన మాతృభాషను మనమే పూర్తిగా మర్చిపోయే దుస్థితి వస్తుందేమో అన్న భయం కలుగుతోంది.
దీనికి తోడు మరో ముఖ్యమైన సామాజిక కోణం కూడా ఉంది. పట్టణవాసులు, విద్యావంతులు మాట్లాడే ఈ ‘ఆంగ్ల–-తెలుగు’ భాష, గ్రామీణులకు, సామాన్యులకు ఏమాత్రం అర్థం కావడం లేదు. వారు ప్రతిసారీ ఆంగ్ల పదాలకు అర్థాలు అడిగి తెలుసుకోవాల్సి వస్తోంది. అడగడానికి సిగ్గు పడితే మరీ ప్రమాదం.
అలాగని ఆంగ్ల పదాలను పూర్తిగా వాడకూడదని దీని అర్థం కాదు.
తెలుగులో సరిపోయే పదం లేనప్పుడు లేదా ఆధునిక వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు ‘కారు’, ‘బస్సు’ లాంటి ఆంగ్ల పదాలను వాడుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ, సాధారణ భావాలకు సైతం మనకు తెలిసిన పదాలను కాదని ‘హ్యాపీ’, ‘వర్రీ’ అంటూ ఆంగ్ల పదాలను వాడటమే ఇక్కడ అసలు సమస్య.
భాష అనేది కేవలం భావప్రసార సాధనం మాత్రమే కాదు, మన సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీక. మనం కొద్దిగా చొరవ తీసుకుని, మనసు పెట్టి ప్రయత్నిస్తే... ఆంగ్ల పదాల వాడకాన్ని తగ్గించి, మధురమైన తెలుగు భాషలో మాట్లాడుకోవడం సులభమే!
శతాబ్దాలుగా సంస్కృత పదాలను మనం తెలుగులో విరివిగా వాడుతున్నాం, నిజమే. కానీ అవి సామాన్యుల జనజీవనంలో కలిసిపోయి అందరికీ సులభంగా అర్థమవుతాయి. ఉదాహరణకు మనం రోజూ వాడే సంతోషం, కష్టం, ప్రయాణం, ఆరోగ్యం, ఆహారం, కోపం, నిద్ర వంటి పదాలన్నీ మూలతః సంస్కృత పదాలే! అయితే, ఈ వ్యాసం ఆ చర్చలోకి వెళ్లడం లేదు.
ప్రస్తుత వ్యాస పరిధి కేవలం మనం మాట్లాడే భాష సామాన్యులందరికీ అర్థమవుతోందా లేదా అన్న దానికి మాత్రమే పరిమితం. ఆ సంస్కృత పదాలు గ్రామీణులకు సైతం అర్థమైపోతాయి. వారెవరికీ ఆ పదాలకు అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అకారణంగా వాడే ‘జర్నీ’, ‘హెల్త్’, ‘మూడ్’, ‘యాంగ్రీ’ లాంటి ఆంగ్ల పదాల పరిస్థితి అలా కాదు; అవి సామాన్యులను భాషాపరంగా దూరం చేస్తున్నాయి.
- శ్రీనివాస్ మాధవ్,వ్యవస్థాపకులు,51A అభీ ఫౌండేషన్
