- ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో రూ.199
- మామిడి ఆకుల తోరణాల కట్ట రూ.20 నుంచి రూ.30
- అరటి పండ్లు రూ.80
- వెలగపండు రూ.50
- కిలో రూ.70 ఉండే బంతి పూలు రూ.150..
- కిక్కిరిసిన గుడిమల్కాపూర్, కొత్తపేట మార్కెట్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు : వినాయక చవితి సందర్భంగా పూల రేట్లను వ్యాపారులు భారీగా పెంచేశారు. ముఖ్యంగా గుడిమల్కాపూర్ పూల మార్కెట్ కు ప్రసిద్ధి. ఇక్కడ హోల్ సేల్ తో పాటు రిటైల్ వ్యాపారం కూడా బాగా జరుగుతుంది.
సాధారణ రోజుల్లో రూ.70 ఉండే బంతిపూల ధర రూ.150 వరకు పలికింది. చామంతులు రూ. 200 నుంచి రూ. 250 వరకు, గులాబీలు రూ. 100 నుంచి 150 వరకు పలికాయి. సాధారణ రోజుల్లో చామంతులు రూ. 100 నుంచి రూ. 150, గులాబీలు రూ. 70 వరకు ఉంటాయి.
వినాయక చవితి సందర్భంగా ప్రతి వినాయక విగ్రహానికి మెడలో పూలదండ వేస్తుంటారు. దీంతో పూల దండల రేట్లు కూడా పెరిగాయి. సైజును బట్టి రూ.500 నుంచి రూ. 2 వేల వరకు విక్రయిస్తున్నారు. 1 నుంచి 2 అడుగులు ఉండే చిన్న విగ్రహాలకు దండ సైజు నుంచి బట్టి బంతి/చామంతి పూల దండలకు రూ.400 తీసుకున్నారు.
మధ్యస్థ విగ్రహాలు 3 నుంచి 5 అడుగులకు బంతి, గులాబీ రేకులు రూ. 500 నుంచి రూ. 1,500 వరకు పలికాయి. నార్మల్ రోజుల్లో 1 నుంచి 2 అడుగులకు రూ.150 వరకు బంతిపూల దండ ధర ఉండేది. చామంతులు, గులాబీలు అయితే రూ. 300 నుంచి రూ. 500 వరకు పలికేవి. కానీ, పండగ కావడంతో పూల దండల రేట్లు కూడా పెరిగాయి.
టెంకాయ, గరిక, బిల్వపత్రం కూడా..
ఇక కొబ్బరికాయ రేట్లు కూడా పెంచేశారు. సాధారణ రోజుల్లో టెంకాయ రూ. 30 ఉండగా పండగ సందర్భంగా రూ.40 నుంచి రూ. 50 వరకు అమ్మారు. వీటితోపాటు వినాయకుడికి అన్నింటికంటే ప్రీతికరమైనది గరిక. పల్లెటూళ్లలో ప్రతి ఇంటా వినాయక చవితి పూజలో గరిక (దూర్వా పత్రం) పెడతారు.
పచ్చని గడ్డి జాతికి చెందిన ఈ మొక్క ఊర్లలో రోడ్ల పక్కన, పొలాల గట్ల వెంట విరివిగా దొరుకుతుంది. వినాయకుడి తలపై మూడు లేదా ఐదు గరిక పోగులను పెట్టి పూజిస్తే స్వామి ఎంతో సంతోషిస్తారు. జిల్లేడు (అర్క పత్రం) పల్లెటూళ్లలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది.
వినాయకుడి రూపమే జిల్లేడు(ఆర్క గణపతి) అని కూడా నమ్ముతారు. తెల్ల జిల్లేడు పూలమాలలు, ఆకులు పూజలో విశేషంగా వాడతారు. మారేడు(బిల్వ పత్రం), ఉత్తరేణి కూడా ఊర్లలో ప్రతి చేను గట్టు పైనా, ఖాళీ స్థలాల్లో విరివిగా లభిస్తాయి.
అయితే, వీటిని కూడా మార్కెట్ లో రూ.100 వరకు గుత్తగా అమ్మారు. - పూజా పత్రి కట్ట రూ.50 నుంచి రూ.150, ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో రూ.199, మామిడి ఆకుల తోరణాల కట్టను రూ.20 నుంచి రూ.30కి విక్రయించారు.
వెలగపండును రూ.50కి అమ్మారు. సాధారణ రోజుల్లో అరటి పండ్లు డజన్ రూ.50 ఉండగా.. ప్రస్తుతం 80 రూపాయలకు అమ్ముతున్నారు. దానిమ్మలు రూ. 120 ఉండగా.. రూ. 160 పైనే విక్రయిస్తున్నారు. ఆపిల్స్, సంత్రతోపాటు ఇతర పండ్ల రేట్లను అమాంతం పెంచేశారు.
