- మీరు ఐక్యంగా ఉంటే రాజకీయాల్లో సముచిత వాటా
- పల్లెల్లో షూరిటీలు లేకుండా రుణాలిచ్చేది మీరే
- కొడంగల్ మున్సిపల్ చైర్మన్‌గా వైశ్యుడికి అవకాశమిచ్చాం
- ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు ఆర్థిక మంత్రిగా రోశయ్య సేవలు
- ఆయన కృషితోనే 16 వేల కోట్ల మిగులు రాష్ట్రంగా తెలంగాణ
- ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన
హైదరాబాద్/ఉప్పల్, వెలుగు: ఆర్యవైశ్యులు ఆర్థిక క్రమశిక్షణకు బ్రాండ్ అంబాసిడర్లు అని ముఖ్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఐక్యంగా ఉండి రాజకీయాల్లో ఉనికిని, సముచిత వాటాను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చెట్టియార్లు, సేఠ్‌లు, అగర్వాల్‌లు, షాలు, మహాజన్లు, గుప్తాలు ఇలా ప్రాంతాలవారీగా పేర్లు వేరైనా అందరూ ఒకే తాటిపై నడవాలని సూచించారు. పోటీ ప్రపంచంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి రాజకీయ వాటాను సాధించుకోవాలని, విభేదాలు లేకుండా ఐక్యతను ప్రదర్శించినప్పుడే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సముచిత ప్రాధాన్యత ఇస్తాయన్నారు.
ఆదివారం ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన మహోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ప్రముఖ వ్యాపారవేత్తలతో కలిసి శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్య భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఆర్థిక సాయం, పరిపాలనా అనుమతులను వంద శాతం అందిస్తామన్నారు.
సమాజ హితం కోసం నిరంతరం పరితపించే వైశ్య సోదరుల సంక్షేమానికి, వారి ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని సీఎం స్పష్టం చేశారు. కొడంగల్ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని ఆర్యవైశ్యుడికే ఇచ్చి గౌరవించానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
నాకు రోశయ్య మార్గదర్శనం చేశారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆర్యవైశ్య ప్రముఖుడు, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య పోషించిన పాత్రను సీఎం రేవంత్ గుర్తు చేశారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి దిగ్గజ సీఎంల హయాంలో 16 ఏళ్ల పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్య.. పైసా పైసాను ఎంతో పొదుపుగా నిర్వహించారని ప్రశంసించారు. రోశయ్య పాటించిన ఆర్థిక క్రమశిక్షణ వల్లే జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి రూ.16,000 కోట్ల మిగులు బడ్జెట్‌తో దేశంలోనే ధనిక రాష్ట్రంగా నిలబడగలిగిందని వివరించారు.
2007లో తాను తొలిసారి శాసనమండలికి ఎన్నికైనప్పుడు రోశయ్య తనను పిలిపించి, లైబ్రరీకి వెళ్లి హోమ్‌వర్క్ చేసే విధానాన్ని ప్రశంసించారని గుర్తుచేసుకున్నారు. అలాగే, ఆవేశం తగ్గించుకుని సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు కోసం ఎలా మెలగాలో కూడా మార్గదర్శనం చేశారని తెలిపారు.
అమరవాయి లక్ష్మీనారాయణ, గణేష్ గుప్తా తదితర నాయకులంతా సమాజాన్ని సమన్వయపరుస్తూ ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆర్యవైశ్యులు సమాజంలో తమకంటూ ఉన్న గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎన్నో కష్టనష్టాలు, పేదరికాన్ని కడుపులోనే దాచుకుని జీవిస్తారే తప్ప బయటకు చెప్పుకోరని పేర్కొన్నారు.
ఆర్థిక క్రమశిక్షణకు బ్రాండ్ అంబాసిడర్లు..
ప్రపంచంలో వ్యవసాయం, వ్యాపారం అనేవి రెండే ప్రాథమిక వృత్తులని.. వ్యాపార రంగంలో అనేక ఒడుదొడుకులను ఎదుర్కొని నిలబడే మెళకువలు తెలిసిన ఏకైక సమాజం ఆర్యవైశ్యులదేనని సీఎం రేవంత్ అన్నారు. పల్లెల్లోనైనా, పట్టణాల్లోనైనా నిరుపేదలకు ఆకలి వేసినా, అత్యవసరమైనా ఎలాంటి తనఖా, షూరిటీలు అడగకుండా ఉదారంగా అప్పు ఇచ్చి ఆదుకునే దాతృత్వం వైశ్యులకే సాధ్యమన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆస్తుల తనఖా ఉంటేనే రుణాలు ఇస్తాయని, కానీ ఊర్లో ఉండే వైశ్య సోదరులు సరుకులు, నగదును నమ్మకంతో అందిస్తారని గుర్తుచేశారు. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణం, వాహనాల కొనుగోలు వంటి శుభకార్యాల సమయాల్లో సామాన్యులు తొలి సలహా, సహాయం కోసం ఆర్యవైశ్యుల వద్దకే వెళ్తారన్నారు. సమాజంలో ఆర్థిక క్రమశిక్షణకు, విశ్వసనీయతకు వారు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తారని సీఎం కొనియాడారు.
ఆర్యవైశ్య సమాజం జాతి నిర్మాణానికి అందించిన సేవలు అసమానమైనవని సీఎం పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు సీతారాం కేసరి, కేంద్ర హోంమంత్రిగా సేవలందించిన పెండేకంటి వెంకటసుబ్బయ్య, లాలా లజపతిరాయ్ వంటి మహనీయులంతా ఈ వర్గానికి చెందినవారేనని కొనియాడారు. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి తెలుగువారి కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ఆమరణ నిరాహారదీక్షతో ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వైశ్యుల బిడ్డ కావడం గర్వకారణమన్నారు.
పేద వైశ్య విద్యార్థులకు ఉపయోగపడాలి..
ఆర్యవైశ్య మహనీయుల ఆశయాలు, స్ఫూర్తిని కాపాడటంలో భాగంగానే హైదరాబాద్ నడిబొడ్డున రోశయ్య విగ్రహాన్ని ప్రతిష్టించామని, భవిష్యత్ తరాలకు వారి త్యాగాలను చాటిచెప్పడం తమ ప్రభుత్వ విధి అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 'ఎంత పేద కోమటి వద్దనైనా కోడిగుడ్డంత బంగారం ఉంటుంది' అనే నానుడి ఉందని, అది వైశ్యుల దార్శనికతకు, ఆర్థిక పొదుపు సూత్రాలకు నిదర్శనమని సీఎం గుర్తుచేశారు.
వందల ఏళ్ల క్రితమే బంగారం విలువను గుర్తించిన దూరదృష్టి వారి రక్తంలోనే ఉందని ప్రశంసించారు. ఉప్పల్ భగాయత్‌లో నిర్మిస్తున్న ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనం కేవలం సంపన్నులకే కాకుండా, పేదరికంలో ఉండి బయటకు చెప్పుకోలేని సామాన్య వైశ్యుల విద్యార్థులకు, నిరుపేద కుటుంబాల అవసరాలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
