జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్‌లో కొత్త కారును అడ్డగించి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 2న రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ట్రూ బ్లాక్ ఎదుట నలుగురు ట్రాన్స్‌జెండర్లు కొత్త కారును అడ్డగించి డబ్బులు ఇవ్వాలని బలవంతం చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
బాధితుడితో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి రూ.2 వేలు డిజిటల్ పేమెంట్ చేయించుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎక్స్‌లో మొగాంబో పేరుతో ఉన్న హ్యాండిల్‌లో ఈ వీడియోను గుర్తించిన కానిస్టేబుల్ ప్రవీణ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితుడు ఎవరు, కారు నంబర్ ఏమిటి, డిజిటల్ పేమెంట్ ఎవరి ఖాతాకు వెళ్లిందనే వివరాలు ఇంకా తెలియలేదు. ట్రాన్స్‌జెండర్లను గుర్తించి, అదుపులోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
