- మన్మోహన్ కు నివాళి అర్పించాక రాహుల్ ఇంటికి వెళ్లిన అన్వర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భేటీ అయ్యారు. ఆదివారం ఢిల్లీలోని రాహుల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. అల్పాహార విందు సందర్భంగా ఇరుదేశాల సంబంధాలపై నేతలు చర్చించారు.
2026 బ్రిక్స్ సదస్సులో భాగంగా భారత్‌కు వచ్చిన మలేసియా పీఎం అన్వర్ ఇబ్రహీం శనివారం ప్రధాని నరేంద్ర మోదీతోనూ సమావేశమయ్యారు. భారత్, మలేసియా దేశాల మధ్య వాణిజ్యం, సెమీకండక్టర్లు, మౌలిక వసతులు, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చించారు. ఆ మరుసటిరోజే అన్వర్ ఇబ్రహీం.. రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిక్స్ భాగస్వామ్య దేశంగా ఉన్న మలేసియాకు.. ఆసియాన్‌లో భారత్‌కు కీలక భాగస్వామిగా గుర్తింపు ఉంది.
మన్మోహన్ తో అనుబంధం
రాహుల్‌తో అన్వర్ భేటీ కావడానికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఆయనకున్న సన్నిహిత అనుబంధం కూడా కారణంగా నిలిచింది. 2024 డిసెంబర్‌లో మన్మోహన్‌సింగ్ మరణించినప్పుడు అన్వర్ ఆయనను తనకు అత్యంత గౌరవనీయమైన, ఆత్మీయ మిత్రుడిగా అభివర్ణించారు. భారత్ ఆర్థికంగా ఎదగడంలో మన్మోహన్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని కూడా అన్వర్ అప్పట్లో వెల్లడించారు.
రాజకీయ కల్లోల సమయంలో అన్వర్ జైలులో ఉన్నప్పుడు.. ఆయన పిల్లల చదువుల ఖర్చును భరించేందుకు మన్మోహన్ ముందుకొచ్చారని గుర్తుచేశారు. తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ.. మన్మోహన్ చూపిన మానవత్వాన్ని ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. మన్మోహన్ గొప్ప రాజనీతిజ్ఞుడని, రాజకీయ నాయకుడిగా కొంత ఇబ్బందికరమైన వ్యక్తిగా కనిపించినప్పటికీ ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని అన్వర్ గతంలో పేర్కొన్నారు.
