డిగ్రీ ప్రిన్సిపాల్ ప్రమోషన్లకు బదిలీ బ్రేక్..ముగిసిన ప్యానెల్ ఇయర్.. నిరాశలో సీనియర్ లెక్చరర్లు

డిగ్రీ ప్రిన్సిపాల్ ప్రమోషన్లకు బదిలీ బ్రేక్..ముగిసిన ప్యానెల్ ఇయర్.. నిరాశలో సీనియర్ లెక్చరర్లు
  • స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 77 కాలేజీల్లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జీల పాలన  
  • ఒకేసారి భర్తీ చేద్దామనుకున్నా దక్కని మోక్షం 
  • బదిలీల తర్వాతే ప్రమోషన్లు ఇచ్చే యోచనలో విద్యాశాఖ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్ పదోన్నతుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అర్హులైన లెక్చరర్లకు ఈ ఏడాది తీవ్ర నిరాశే మిగిలింది. బదిలీల ప్రక్రియ కొలిక్కి రాకపోవడం, మరోవైపు ప్యానెల్ ఇయర్ గడువు ముగియడంతో ఆ ప్రమోషన్లకు బ్రేక్ పడింది. దీంతో ప్రిన్సిపాల్ పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. 

బదిలీలు పూర్తికాకుండానే ప్రమోషన్లు ఇస్తే సీనియర్ లెక్చరర్లకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో కొత్త ప్రిన్సిపాల్స్ నియామకం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ప్రస్తుత ప్యానెల్ ఇయర్ ఆగస్టు 31 నాటితో ముగిసిపోవడంతో ఈ విద్యా సంవత్సరంలో ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించే అవకాశం లేకుండా పోయింది.

77 కాలేజీల్లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జీలే

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండగా.. ప్రస్తుతం 75 మంది మాత్రమే రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ పనిచేస్తున్నారు. మరో 77 కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో అసలు ప్రిన్సిపాల్ పోస్టులే మంజూరు కాలేదు. 

దీంతో ఒక్కో ప్రిన్సిపాల్ మూడు, నాలుగు కాలేజీలకు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జీలుగా కొనసాగుతూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లి రావడం వారందరికీ తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అయితే, యూజీసీ నిబంధనల ప్రకారం ప్రిన్సిపాల్ కావాలంటే 15 ఏండ్ల సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ కలిగి ఉండాలి. 

ప్రతిఏటా డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ (డీపీసీ) నిర్వహిస్తున్నప్పటికీ, అర్హులైన వారు పూర్తిస్థాయిలో లభించకపోవడంతో ఖాళీలు అలాగే ఉండిపోతున్నాయి. ఈ ఏడాది అర్హులైన వారు ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలోని అన్ని ఖాళీలను ఒకేసారి భర్తీ చేసేందుకు కళాశాల విద్యాశాఖ కసరత్తు చేసింది. 

దీంట్లో భాగంగా జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే నోటిఫికేషన్ జారీ చేసి, అర్హులైన 150 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి స్క్రూటినీ కూడా పూర్తి చేసింది. అయితే, డీపీసీ సమావేశం కాకపోవడం, ఆగస్టు 31తో ప్రమోషన్ ప్యానెల్ గడువు ముగియడంతో మళ్లీ యథావిధిగా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జీల పాలనే కొనసాగే దుస్థితి ఏర్పడింది.
 
జీవో 38కి జనగణన అడ్డంకి!

ఉద్యోగుల బదిలీల కోసం ప్రభుత్వం ఇప్పటికే జీవో 38ని జారీ చేసింది. అయితే, దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన జనగణన డ్యూటీల కారణంగా విద్యాశాఖలో బదిలీల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఒకవేళ బదిలీలు చేయకుండానే ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తే.. ప్రస్తుతం పనిచేస్తున్న సీనియర్లకు నష్టం జరిగే ప్రమాదం ఉందని కొందరు ప్రిన్సిపాల్స్ విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు.

 ప్రమోషన్ పొందే జూనియర్లకు మంచి ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దక్కే అవకాశం ఉండి, సీనియర్లు నష్టపోతారనే వాదన రావడంతో అధికారులు ప్రమోషన్లను ఆపినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ప్యానెల్ ఇయర్ గడువు ముగిసిపోవడం, బదిలీల ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టేలా ఉండటంతో.. ఈ లోపు ప్రమోషన్లు ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా బదిలీలు పూర్తి చేసి, ఆ తర్వాతే మిగిలిన స్థానాలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. 

ఈ లెక్కన కొత్త ప్రిన్సిపాల్స్ బాధ్యతలు చేపట్టాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడక తప్పదు. అయితే, గతంలో బదిలీలతో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇచ్చారని, కావాలనే కొందరు అధికారులు ఈ ప్రక్రియను ఆలస్యం చేశారంటూ సీనియర్ లెక్చరర్లు ఆరోపిస్తున్నారు.