అయ్యోపాపం:వడ్ల బస్తాలు మీద పడి హమాలీ కూలీ ప్రాణాలు కోల్పోయాడు.. హన్మకొండ జిల్లాలో ఘటన

అయ్యోపాపం:వడ్ల బస్తాలు మీద పడి హమాలీ కూలీ ప్రాణాలు కోల్పోయాడు.. హన్మకొండ జిల్లాలో ఘటన
  •  దండేపల్లి గ్రామంలోని మిల్లులో ఘటన

ఎల్కతుర్తి, వెలుగు : వడ్ల బస్తాలు మీద పడి హమాలీ కార్మికుడు చనిపోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలోని శ్రీనిధి ఇండస్ట్రీస్​ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా మోహన్ పూర్ ఇందిరానగర్ కు చెందిన జటన్ మాంజీ (36) శ్రీనిధి ఇండస్ట్రీస్ లో హమాలీగా పనిచేస్తున్నాడు. 

ఆదివారం ఉదయం తోటి కార్మికులతో కలిసి వడ్ల బస్తాలను లారీలో లోడ్​చేస్తున్నాడు. ఈ క్రమంలో వడ్ల బస్తాలు ఒక్కసారిగా మాంజీ మీద పడిపోయాయి. గమనించిన తోటి హమాలీలు బస్తాలను తొలగించి, మాంజీని ​ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడి బంధువు రాజ్​బల్లాహ్ మాంజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నర్సింహారావు తెలిపారు.