జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలో రోడ్లపై వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి హెచ్చరించారు. ఆదివారం సంజయ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన మార్కెట్‌ను కమిషనర్ చిమ్ముల రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. మార్కెట్‌లో ఏర్పాటు చేసిన పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, లైటింగ్, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను పరిశీలించారు. మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
నూతన మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, పూలు, వెజ్, నాన్‌వెజ్ వ్యాపారాలకు అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. ప్రజలు కూడా రోడ్ల పక్కన కాకుండా మార్కెట్‌లోనే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని కోరారు. రోడ్లు, వీధుల్లో రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తే మున్సిపల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
