మట్టి వినాయకుడినే పూజించాలని రాజకీయ నాయకులు.. విద్యావేత్తలు.. ఇతరులు చాలామంది చెబుతున్నారు. పురాణాల్లో మట్టి గణపతి గురించి ఏముంది. నిజంగా వినాయకచవితి రోజు మట్టి గణపతిని పూజించడం వలన కాలుష్యం తగ్గుతుంతుందా.. ఈప్రశ్నకు రుషులు.. మహర్షులు.. ఏం చెబుతున్నారు. పురాణ ప్రాశస్త్యం ఏమిటి.. అసలు వినాయక రూపాన్ని ఎవరు సృష్టించారు.. మట్టి గణపతిని మొదట ఎవరు పూజించారు.. మొదలటు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం. . .!
వినాచయకచవితికి నెల రోజుల ముందే మట్టి వినాయకుడినే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అనే స్లోగన్ పబ్లిసిటి అయింది. సిమెంట్ విగ్రహాల వలన కాలుష్యం వస్తున్నట్లు అందరూ అంటున్నమాట. ఇది కొంతవరకు వాస్తవమైనా.. పురాణాల ప్రకారం వినాయక చవితి రోజు మట్టి వినాయకుడిని పూజించాలి. దీనికి సంబంధించి గణపతి లీలా వైభవంలో ఉందని రుషులు చెబుతున్నారు.
గణపతి వైభవం.. గణపతి లీలలు గురించి సూతుల వారు శౌనకాదులకు వివరిస్తున్నారు. ఆ సమయంలో వినాయకచవితి రోజు మట్టి వినాయకుడినే పూజించాలని చెప్పారు. అప్పుడు శౌకనాదులు సూతుల వారిని ఇలా అడిగారు. అందరి దేవతల మాదిరిగా వినాయకుడిని కూడా లోహంతో తయారు చేసిన విగ్రహాలను ఎందుకు పూజించకూడదు... నవరాత్రిళ్లలో పూజించిన విగ్రహాన్ని నీళ్లలో ఎందుకు నిమజ్జనం చేయాలి. దీనికి ఉన్న పురాణ ప్రాశస్త్యం ఏమిటి అని అడిగారు
అప్పుడు సూతుల వారు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూపరమేశ్వరుడు విశ్వవ్యాపితంగా ఉన్నాడు. అంటే అంతటా ఉన్నది పరమాత్ముడే. అలాంటి పరమాత్మ తత్వము భూమికి ఉంటుంది. కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని (అంతటా , అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు శివుడు.
విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైనది కేవలం మట్టి మాత్రమే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే కలిసిపోతాయి.
►ALSO READ | గణేష్ ఫెస్టివల్: భారీ జాతర ..మండపం నుంచి మెగా లడ్డూ వరకు.. కోట్ల రూపాయిల లావాదేవీలు..!
లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రూపాన్ని మట్టితో తయారుచేశాడు. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు. మృత్తికయే పరబ్రహ్మ కనుక , మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది.
అంతేకాదు మట్టి ఎక్కడైనా , ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా , ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భూమి , మట్టి , వసుధ, బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం , పూజ" అని చెప్పాడు సూతుడు. కాబట్టి శివుడి కూడా మట్టి విగ్రహాన్నే పూజించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
